మల్యాల, డిసెంబర్ 8 : ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్నది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, భక్తుల ఇలవేల్పుగా విలసిల్లుతున్న ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల తాకిడి ఉంటుంది. గతంలో వచ్చే వారి సంఖ్య వేలల్లోనే ఉన్నా.. క్రమంగా లక్షలకు చేరింది. అయినా నాటి సమైక్య పాలకులు ఏనాడూ కొండగట్టు అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ, స్వరాష్ట్రంలో ప్రగతికి అడుగులు పడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ప్రత్యేక ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆరు నెలల క్రితమే యాదాద్రిని పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ నర్సన్న దీవెనతో వేములవాడ, కొండగట్టు క్షేత్రాల అభివృద్ధికి కదిలారు. వేములవాడలో ఇప్పటికే వందల కోట్ల అభివృద్ధి పనులు పరుగులు పెరుగుతుండగా, కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి గతంలోనే మాస్టర్ ప్లాన్ రూపొందించారు.
ఆర్కిటెక్చర్ల ఆధ్వర్యంలో రాబోయే 50 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా వసతుల కల్పనకు వేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన నిర్మాణాలు, ఇతర అభివృద్ధ్ది పనులపై అధ్యయనం చేసిన ఆలయ అధికారులు, ఆర్కిటెక్చర్లు అతిత్వరలో మాస్టర్ ప్లాన్‌కు తుదిరూపం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ అమలు కోసం ముక్తేశ్వర్ రూపొందించిన ప్రణాళికలను సైతం గతంలో సీఎంవో ఆదేశాల మేరకు యాదగిరి గుట్ట ఆలయ నిర్మాణ ఆర్కిటెక్టర్ ఆనంద్‌సాయి ఆలయాన్ని పరిశీలించారు. దేవస్థానానికి గతంలో 20 ఎకరాలు ఉండగా, పక్కన ఉన్న 384 ఎకరాలను కూడా అప్పగించారు. మిషన్ భగీరథ ద్వారా కొండగట్టు అంజన్న సన్నిధిలో తాగునీటి కొరతను తీర్చడంతోపాటు కొత్తగా నిర్మించిన కోనేరును వినియోగంలోకి తీసుకువచ్చారు. తాజాగా (గురువారం) జగిత్యాలలో జరిగిన సభా వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు, ధర్మపురి, వేములవాడ రాజన్న ఆలయాల గురించి ప్రస్తావిస్తూనే.. వాటి అభివృద్ధి కోసం చేపట్టబోయే ప్రణాళికలను వివరించారు.
ప్రత్యేకంగా కొండగట్టుకు వంద కోట్లు ఇస్తామని ప్రకటించారు. మార్పుల చేర్పుల తర్వాత కొత్త మాస్టర్ ప్లాన్ తయారుచేస్తే.. దాని ప్రకారం రూ.100 కోట్లతో కొండపై ప్రాంతంతోపాటు అంజన్నకు చెందిన 400 ఎకరాల్లో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నది. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా ఆలయంలోని ప్రాకారం, మూడువైపులా చిన్న రాజగోపురాలు, సీతమ్మ కన్నీటిధార ప్రాంతం నుంచి పైన దుకాణాల తొలగింపుతోపాటు ఆలయ ప్రాంగణం విస్తరణ, క్యూలైన్లు క్రమబద్ధీకరించే అవకాశం ఏర్పడుతుంది. వీఐపీల కోసం ప్రత్యేక గదులు, విల్లా తరహాలో ప్రత్యేక కాటేజీలు, జీ+2 తరహాలో భక్తులకు ప్రత్యేక డార్మెటరీలు, అర్చకులకు నివాస సముదాయాలు, ఉద్యోగులకు ఆలయ సముదాయాలు, ప్రత్యేకమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు, నలు వైపులా రోడ్లు, మెట్లదారి టీటీడీ తరహాలో సుందరీకరణ, భక్తులకు నిత్యాన్నదాన సత్రాలు, వాహనాల పార్కింగ్ సదుపాయం, అంతర్గత డ్రైనేజీ, విద్యుదీకరణ, కొత్త లైట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆలయ పరిధిలో ఉన్న అశోకవనంతోపాటు స్వామివారికి నిత్యం అలంకరించేందుకు పూల తోటలను పెంచే అవకాశం ఉన్నది. రూ.100 కోట్ల ప్రకటనతోపాటు సీఎం కేసీఆరే స్వయంగా కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చి ప్రత్యేకంగా అభివృద్ధి పనులను తానే ప్రారంభిస్తానని తెలుపడంతో స్థానిక ప్రజలతోపాటు భక్తుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే పలు ఆలయాలు అభివృద్ధి చెందుతున్నవి. ఈ నేపథ్యంలోనే రామకోటి స్తూపం నిర్మించారు. యాదాద్రి తరహాలో అంజన్న ఆలయానికి నిధులు మంజూరు ప్రకటన చేయడంతోపాటు సీఎం కేసీఆరే స్వయంగా వచ్చి పనులను ప్రారంభించి పర్యవేక్షిస్తానని సభాముఖంగా చెప్పడం గర్హనీయం. ఆలయాల మహత్యం, చరిత్ర దెబ్బతినకుండా భావితరాలకు చరిత్రను ఇనుపడింపజేసేలా ఆలయాల పునర్నిర్మాణం ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యం.
-కొండపలుకుల రాంమోహన్‌రావు, జడ్పీటీసీ (మల్యాల)
కొండగట్టు అంజన్న ఆలయ పరిసరాలను మరింత అభివృద్ధి చేయడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది. తద్వారా ఆలయ ఖ్యాతి మరింత పెరుగుతుంది. ఎన్నో ఎళ్ళుగా పెండింగ్‌లో ఉన్న మాస్టర్ ప్లాన్‌ను సమూల మార్పులు చేసి అమలు చేసే అవకాశం ఉన్నది. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రానున్న రోజుల్లో భక్తులకు వసతితోపాటు పలు సౌకర్యాలు ఏర్పడుతాయి.
– జితేంద్రప్రసాద్, ప్రధాన అర్చకుడు (కొండగట్టు దేవస్థానం)
నేను ఎన్నో ఏళ్లుగా స్వామి ఆలయానికి వస్తున్నా. కొంత కాలంగా స్వామివారి ఆలయ పరిసరాల్లో బస చేస్తూ నిత్యం పల్లకీ సేవలో పాల్గొంటున్నా. ఆలయానికి ప్రభుత్వ పరంగా రూ.100 కోట్ల నిధులను కేటాయించడం వల్ల మరిన్ని వసతులు ఏర్పడే అవకాశం ఉన్నది. ఇప్పటికీ భక్తులకు రేకులషెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడం వల్ల మరిన్ని కాటేజీలు ఏర్పాటయ్యే అవకాశం ఉన్నది.
– రాము, భక్తుడు