ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకోవడం, ఆ వివరాలను మంత్రి కేటీఆర్ వెల్లడించడంతో ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు. సోమవారం రాత్రి డిపోల్లో సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం పొందినంక తాము ప్రభుత్వోద్యోగులుగా మారుతామని, తమ జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతాయని, కుటుంబాలకు భరోసా దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాహసోపేత నిర్ణయం కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే సాధ్యమైందని, జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు. తమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి తమను తలెత్తుకొని తిరిగేలా చేశారని, కేసీఆర్ మేలును ఎప్పటికీ మర్చిపోమని స్పష్టం చేశారు.
– కరీంనగర్, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఎన్నో ఏళ్లుగా మా బాధలు ప్రభుత్వాలకు చెప్పుకుంటూ వస్తున్నం. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలె. తెలంగాణ ఏర్పడినంకనే మాకు న్యాయం జరిగింది. ప్రభుత్వ శాఖలకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన కేసీఆర్.. మా కష్టాన్ని గుర్తించి 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చిండు. అంతకు ముందు వరకు మా బతుకులు దుర్భరంగా ఉండేవి. 2014 నుంచి కాస్త మంచిగ బతుకుతున్నం. ఇప్పుడు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల మాకు చాలా ప్రయోజనం జరుగుతది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం. సీఎం కేసీఆర్సార్కు జన్మంతా రుణపడి ఉంటం. 2019లో మేం సమ్మెకు వెళ్లినప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నదే మా ప్రధాన డిమాండ్ ఉండె. అప్పుడే కేసీఆర్ సార్ మాకు సూచన ప్రాయంగా హామీ ఇచ్చిండు. ఆ హామీని నిలబెట్టుకున్నడు. ప్రతి ఆర్టీసీ ఉద్యోగి కుటుంబం సంబురాలు చేసుకుంటున్నది. ఇన్నాళ్లూ పడ్డ కష్టాలు మర్చిపోతం. మాకు ఇంత మేలు చేసిన కేసీఆర్ సార్‌ను ఎప్పటికీ మర్చిపోం.
– మడుపు ప్రభాకర్ రెడ్డి, టీఎంయూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి
తెలంగాణ వస్తే ఏమొస్తదన్నోళ్లకు మేమే ఒక సమాధానం. మా కలను నిజం చేసి చూపించిన దేవుడు కేసీఆర్. ఏండ్ల నుంచి ప్రజలకు సేవలందిస్తున్న మమ్మల్ని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించడం చాలా సంతోషం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు సీఎం సార్‌కు రుణపడి ఉంటం. ఉద్యమ కాలంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని వరాలను నెరవేరుస్తున్న సీఎంకు మా కృతజ్ఞతలు. మా కుటుంబాలకు మంచి భవిష్యత్తునిచ్చిన కేసీఆర్‌ను ఎన్నటికీ మర్చిపోం. జీవితాంతం రుణపడి ఉంటం.
– శ్రీవాణి, కండక్టర్ (సిరిసిల్ల డిపో)
మాకు చాలా సంతోషంగా ఉంది. నేను కౌంటర్లో క్యాష్ కట్టి వస్తుంటే అందరూ అంటున్నరు. మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిండ్రని. ఆ మాట వింటుంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నం. కేసీఆర్ సార్ మాకెంతో మేలు చేసిండ్రు. మా కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నయ్.
– కోమల కండక్టర్, డిపో-2, కరీంనగర్
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. సోమవారం రాత్రి ఉద్యోగులు డిపోల్లో సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కరీంనగర్(నమస్తే తెలంగాణ) : నష్టాలబాటలో నడుస్తున్న ఆర్టీసీని ఆదుకోవాలంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలతో కలిసి కార్మికులు 2019 డిసెంబర్లో సమ్మెబాట పట్టారు. కార్మికుల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, 2019 డిసెంబర్ 1న భేటీ అయ్యారు. అనేక సాహోపేత నిర్ణయాలు తీసుకొని, ఆర్టీసీకి మద్దతు ఇస్తూనే కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటున్నారు. ఆర్టీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడంతోపాటు కాం ట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించారు. కార్మికులను ఉద్యోగులుగా గుర్తించారు. అలాగే మహిళా కండక్టర్లకు డే డ్యూటీలు మాత్రమే వేసేలా చూశారు. ఇవే కాదు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న పార్శిల్ వ్యవస్థను రద్దు చేసి, ఆర్టీసీ పరిధిలోకి తెచ్చారు. దీంతోపాటు సంస్థ మెరుగుదలకు ప్రభుత్వం పరంగా అనేక చర్యలు తీసుకున్నారు. వినూత్న స్కీంలను అమల్లోకి తెచ్చి ప్రయాణికుల మెప్పు పొందేందుకు ప్రయత్నాలు చేశారు. ఒకప్పటితో పోలిస్తే ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆర్టీసీ కొంత గాడిన పడింది. అయితే అనుకున్న స్థాయిలో మాత్రం ముందుకు వెళ్లలేదు. కొన్ని డిపోలు లాభా ల బాటలో నడుస్తున్నా.. మరికొన్ని డిపోలు మాత్రం నష్టాల్లో కూరుకుపోయాయి. మొత్తంగా ఆర్టీసీలో నష్టాలు పెరుగుతూ వసు ్తన్న నేపథ్యంలో తమ ఉద్యోగాలు ఉంటాయో..? ఊడుతాయో..? అన్న ఆందోళన ఉద్యోగ కుటుంబాల్లో మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి కార్మిక కుటుంబం ప్రభుత్వం చేయూతవైపు చూస్తున్నది.
ఉద్యోగాలపై నిత్యం ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సోమవారం జరిగిన కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని స్వయంగా మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 3నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పాస్ చేస్తామని కూడా తెలిపారు. నిజానికి ఈ నిర్ణయం ఆర్టీసీ చరిత్రలో సరికొత్త మలుపు కానుంది. అంతేకాదు, వేలాది మంది కార్మికుల జీవితాలో ఒక భరోసా నింపనున్నది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. ఇన్నేళ్లుగా నిరీక్షించినందుకు మాకు న్యాయం జరిగింది. మాకు ఇంత మంచి పని చేసిన కేసీఆర్ సార్‌ను ఎప్పటికీ మర్చిపోం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చాలా ఏండ్ల నుంచి వేచి చూస్తున్నం. మాకు న్యాయం చేసిన సీఎం కేసీఆర్‌ను, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌ను జీవిత కాలం గుర్తుంచుకుంటం.
– జక్కుల మల్లేశం, ఎంప్లాయ్స్ యూనియన్ జోనల్ కార్యదర్శి
కేసీఆర్ సార్ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు మాకు న్యాయం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు మా బతుకులకు భరోసా ఏర్పడింది. మాకు న్యాయం చేసిన ముఖ్యమంత్రికి జన్మంతా రుణపడి ఉంటం.
– అబ్దుల్ అలీం, డ్రైవర్, కరీంనగర్-1 డిపో
తెలంగాణ వస్తే మాకు, మా బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో ఉద్యమ బాట పట్టినం. రాష్ట్రం వచ్చేదాక బస్సుక పయ్యా నైచలేగా.. అంటూ బస్సులన్నీ బంద్ పెట్టి కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడినం. తెలంగాణ బిడ్డల కష్టాలు తెలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వెంటనే ఆయనపై గట్టి నమ్మకంతో ఉద్యోగాలు చేస్తూ వచ్చినం. మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నరు. ఇందుకు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు. ఆర్టీసి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు.
– జీపీ సింగ్, సిరిసిల్ల, టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి
ఆర్టీసీ ఉద్యోగులు ప్రజల కోసం పడుతున్న కష్టాన్ని సీఎం కేసీఆర్ సార్ గుర్తించిన్రు. మాకు ఎంతో మేలు చేకూరేలా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నరు. మా ఆర్టీసీ ఉద్యోగుల గురించి ఆయన ఎంతో గొప్పగా మాట్లాడిన్రు. మేం పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు వివరించిన్రు. ఇంతకు ముందు ప్రభుత్వాలు మాతోని వెట్టిచాకిరి చేయించుకున్నయ్. మా బతుకులతోని ఆడుకున్నయ్. అరకొర జీతాలిచ్చి మా కడుపులు మాడ్చినయ్. తెలంగాణ వచ్చినంకనే మాకు న్యాయం జరిగింది. మాకు పే స్కేల్ ఇచ్చి ఆదుకున్నరు. 2019లో సమ్మె చేసినప్పుడు మాకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిన కేసీఆర్ సార్ మా బాధలు విన్నరు. అప్పుడే అనుకున్నం ఏదో ఒక రోజు మాకు న్యాయం జరుగుతదని. మేం ప్రభుత్వ ఉద్యోగులం అయితమని అప్పటి నుంచే కలలుగన్నం. అవి ఇప్పటికి నెరవేరినయ్. మా కుటుంబాలకు న్యాయం జరిగింది. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది.
– మనోహర్, టీఎంయూ, కరీంనగర్-1 డిపో కార్యదర్శి
ఇన్నేండ్ల చరిత్రలో ఎన్నో అద్భుతాలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆర్టీసీ కార్మికులమంతా గట్టి నమ్మకం పెట్టుకున్నం. పన్నెండేళ్లుగా ఎదురు చూస్తున్న మాకు ఈరోజు సంతోషకరమైన వార్త చెప్పిన్రు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం కేసీఆర్ సార్ సాహోసోపేత నిర్ణయం తీసుకున్నరు. అనేక రాజకీయ పార్టీలు ఎన్నో వాగ్ధానాలు చేసినయ్. కానీ, ఒక్కటి కూడా అమలు చేయలే. మా పోరాటాలు, కష్టాలను గుర్తించిన దేవుడు కేసీఆర్. మా చిరకాల కల నెరవేర్చిన ముఖ్యమంత్రిని కాపాడుకుంటం. మళ్లీ ఆయన వస్తేనే తెలంగాణ బాగుపడుతది.
– లకావత్ రాంరెడ్డి, టీఎంయూ అధ్యక్షుడు,
కరీంనగర్ రీజియన్‌లో 11 డిపోలు ఉండగా దాదాపు 900 వరకు బస్సులు నడుస్తున్నాయి. రీజియన్‌లో రోజుకు 3.5 లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ వర్క్‌షాపును కలుపుకొని రీజియన్‌లో 3,931 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వీరందరికీ లబ్ధి చేకూరనుండగా, ఉద్యోగులంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కేటీఆర్ వెల్లడించగానే.. ఆర్టీసీ బస్స్టేషన్లలో సంబురాలు చేసుకున్నారు. సీఎం చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న మా కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తమతో వెట్టి చాకిరీ చేయించుకున్నారని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అప్పటి ప్రభుత్వాలు వ్యవహరించాయని, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తమకు న్యాయం చేశారని చెప్పారు. ప్రభుత్వోద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే తమకు 44 శాతం ఇచ్చి తమ కష్టానికి ప్రతి ఫలం అందించారని కొనియాడారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంలో తమ సంస్థను విలీనం చేసి తమను తలెత్తుకొని తిరిగేలా చేశారని, కేసీఆర్ మేలును ఎప్పటికి మర్చిపోమని స్పష్టం చేశారు.
తెలంగాణ చౌక్, జూలై 31 : సోమవారం రాత్రి కరీంనగర్ ఆర్టీసీ బస్టేషన్ ఆవరణలోని వన్ డిపో ముందు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ భారీ కటౌట్లతో బస్టేషన్ మొత్తం తిరిగారు. కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. చాలా సేపు బస్టేషన్ ఆవరణలోనే సంబురాలు చేసుకున్న ఉద్యోగులు అక్కడి నుంచి డీజే సౌండ్స్‌తో తెలంగాణ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లారు. నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరు ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు తమ పిల్లలతో సహా వచ్చి సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ఆనందంలో నృత్యాలు చేశారు. ఏండ్ల నాటి డిమాండ్‌ను నెరవేర్చి, మా బతుకులకు భరోసా కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెబుతున్నారు. తెలంగాణ వస్తే ఏమవుతుందని ఆశ పడ్డామో ఈ రోజు అది నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీఎంయూ ఎంప్లాయ్స్ యూనియన్ జోనల్ కార్యదర్శి జక్కుల మల్లేశం, కరీంనగర్ డిపో-1 కార్యదర్శి మనోహర్ తదితరులు, కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటం. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్ సార్‌కు, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కవితక్కకు ధన్యవాదాలు. ఇన్ని రోజులు మమ్మల్ని చాలా మంది చిన్న చూపు చూసిన్రు. ఇప్పటి నుంచి మేం ప్రభుత్వ ఉద్యోగులం అవుతున్నందుకు గర్వంగా ఉంది.
– సంధ్య, కండక్టర్, డిపో-2 కరీంనగర్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మకమైన నిర్ణయం. ఉమ్మడి రాష్ట్రం నుంచి పోరాడుతున్న మా డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పదించడం హర్షనీయం. ఆర్టీసీ కార్మికులకు బంగారు భవిష్యత్ ఉంటది.
– కేకే రెడ్డి, తెలంగాణ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ నేత, గోదావరిఖని డిపో
సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు దేవుడు. సంస్థ నష్టాల్లో ఉన్న సమయంలో బడ్జెట్లో నిధులు కేటాయించి కాపాడిండు. పలు రాష్ర్టాల్లోని ఆర్టీసీ సంస్థలకు అక్కడి ప్రభుత్వాలు ఎలా నిధులు సమకూర్చాయో తెలుసుకుని తెలంగాణాలోనూ నిధులు అందించిన్రు. కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తా అని చెప్పి, నెరవేర్చిన్రు. సంస్థను కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం అభినందనీయం. రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులను కన్న బిడ్డల్లా కాపాడుకుంటున్నరు.
– బెజ్జంకి రవీందర్రావు, కంట్రోలర్, జగిత్యాల డిపో
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తున్నరు. ఆర్టీసీ సంస్థను కాపాడుతానని చెప్పి కాపాడిన్రు. సంస్థలోని కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తా అని చెప్పి, సంస్థను అక్కున చేర్చుకున్న ఘనత ఆయనదే. స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత ఆర్టీసీ కార్మికులది. అలాంటి వారిని గుర్తుంచుకుని వారి కష్టాలను తీర్చడానికి ప్రభుత్వంలో విలీనం చేయడం నిజంగా అభినందనీయం. దీని వల్ల ఉద్యోగుల కుటుంబాలకు ఆసరా ఇచ్చినట్టు అవుతుంది.
– కే శంకర్‌రెడ్డి, టీఎంయూ రీజినల్ ప్రెసిడెంట్, జగిత్యాల
టీఎస్ ఆర్టీసీని కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలో విలీనం చేసినందుకు సీఎం కేసీఆర్ రుణపడి ఉంటాం. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం కార్మికులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకున్నరు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం కార్మికులతో పాటు సంస్థను సైతం ప్రభుత్వంలో విలీనం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 43370 మందికి లబ్ధి జరుగుతుంది. ఐదుగురు ఐఏఎస్ అధికారులతో వేసిన కమిటీ రెండు రోజుల్లో విధివిధానాలను ముఖ్యమంత్రికి అందిస్తుంది. ఆ తర్వాత ఈ నెల 3న జరిగే అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి అమలులోకి తెచ్చే అవకాశం ఉన్నది.
-ఎండీ మునీర్, కండక్టర్, మంథని ఆర్టీసీ డిపో
ఇన్ని రోజులు ఆర్టీసీలో చాలీచాలని జీవితాలతో ఇబ్బంది పడ్డ మా కష్టాలను గుర్తించిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ మీటింగ్ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఈ నెల 3న అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెడుతామని చెప్పడం హర్షించదగ్గ విషయం. ఇన్ని రోజులు సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసిన మమ్మల్ని ముఖ్యమంత్రి గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుతున్నందుకు సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రికి ఆర్టీసీ కార్మికులమంతా జీవితాంతం రుణ పడి ఉంటాం.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని దశాబ్దాలుగా మేం కోరుతున్నాం. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ కల నెరవేరింది. ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నరు. రానున్న రోజుల్లో ఆర్టీసీ కార్మికులు గర్వంగా బతికే రోజులు వస్తయ్.
– భూతం రమేశ్, ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్, గోదావరిఖని ఆర్టీసీ డిపో