Godown | కరీంనగర్ కలెక్టరేట్, జూలై 04 : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక స్వావలంభనతోనే మహిళలు ఉన్నత స్థితికి చేరుతారు. ఇందుకోసం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండగా, క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ద శైలిని అవలంభిస్తున్నారనే విమర్శల వెల్లువ సాగుతోంది. ఫలితంగా మహిళా మణులు కోటీశ్వరులవటం దేవుడెరుగు కానీ, వారి ఆదాయమార్గాలు మాత్రం మూతబడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికే కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే కమీషన్లు సక్రమంగా చెల్లించటం లేదనే అపవాదు ఉండగా, తమకొచ్చిన ఆదాయంతో నిర్మించుకున్న శాశ్వతాదాయ వనరుల నిర్వహణపై కూడా నిర్లక్ష్యం కనబరుస్తూ భారీ మొత్తంలో ఆదాయానికి గండి కొడుతున్నా, పాలకులు పట్టించుకోవటం లేదని స్వయం సహాయక సంఘాల సభ్యులు వాపోతున్నారు. మహిళల సంక్షేమం, వారి ఆర్థికాభ్యున్నతి, మహిళా సంఘాల నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించే జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో నగర సమీపంలో దాదాపు దశాబ్దంన్నర క్రితం భారీ గోదాము నిర్మించారు.
కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ గోదాంలో సమీపంలోని రైసుమిల్లుల యజమానులు తాము సేకరించిన ధాన్యాన్ని, అలాగే పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మిల్లుల నుంచి సేకరించే బియ్యాన్ని నిల్వ చేసేవారు. దీని ద్వారా జిల్లా సమాఖ్యకు ప్రతి నెల రూ.1.50లక్షలకు పైగా ఆదాయం వస్తుండగా, ఈ మొత్తాన్ని మహిళా సంఘాలకు నిర్వహించే వివిధ రకాల కార్యక్రమాలకు వినియోగిస్తుండేవారు.
దీంతో, మహిళల ఆర్థిక ఎదుగుదలకు వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడైనట్లుగా ఉండేది. అయితే, గత ఏడాదిన్నరగా ఈ గోదాము ఖాళీగానే దర్శనమిస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలోని మార్కెటింగ్ విభాగానికి చెందిన కొంతమంది సిబ్బంది ఒత్తిడి మూలంగా గోదామును అద్దెకు తీసుకున్న యజమానులు ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. గోదాము అద్దె పెంచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినా నిర్వహణ పర్యవేక్షించే సిబ్బంది మాత్రం అనేక తిరకాసులు పెట్టడంతో, వెనుకడుగేసినట్లు సమాచారం. పట్టుబట్టి ఖాళీ చేయించిన సదరు సిబ్బందిని సమీపంలోని మిల్లర్లతో పాటు వ్యాపార సంస్థల నిర్వాహకులు తమకు అద్దె ఇప్పించాలంటూ వేడుకున్నా, గతంలో కిరాయిదారులకు విధించిన షరతులనే ముందుకు తేవటంతో వారు కూడా వెనుకకు తగ్గినట్లు తెలుస్తోంది.
దీంతో, నాటి నుంచి నేటి వరకు ఆ గోదాము ఖాళీగానే ఉంటుండగా, నెలకు లక్షన్నర దాకా అద్దె కోల్పోవాల్సి వస్తుంది. అలాగే, గోదాం వినియోగంలో లేకపోవటంతో శిధిలావస్థకు చేరుతున్నదని పరిసర ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు. గోదాం నిర్వహణపై కనీస పట్టింపులేకపోవటంతో పరిసరాల్లో చెట్లు పెరిగి, చెత్తా చెదారం పేరుకుపోయి అటవీ జంతువులకు ఆలవాలంగా మారిందని, విషపురుగులతో పాటు మానేరు జలాశయం గుండా గోదాంలోకి చేరుతున్న వానర మూకలు తమపై దాడులకు దిగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది మాసాల క్రితం ఈదురు గాలులకు పైకప్పు ధ్వంసం కాగా, లక్షలాది రూపాయలు వెచ్చించి సంబంధిత యంత్రాంగం మరమ్మత్తులు చేపట్టింది. పరిసరాలు శుభ్రం చేసి అద్దెకిచ్చేందుకు అంతా సిద్ధం చేసినా, గిట్టుబాటు కాకపోవటంతో పూర్వ స్థితినే కొనసాగిస్తున్నారు. చేపట్టిన మరమ్మత్తులు కూడా ఎప్పటిమాదిరిగా కావటంతో తిరిగి కొత్తగా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఫలితంగా నెలనెలా లక్షలాది రూపాయల ఆదాయం దూరమవుతున్నా, పర్యవేక్షణ సిబ్బంది మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు చూడకుండా నిర్లక్ష్యం వహించటంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. స్థిరమైన ఆదాయ రూపకల్పనలో భాగంగా నిర్మించిన ఈ గోదాము కొద్దిమంది సిబ్బంది నిర్వాకంతో జిల్లా సమాఖ్య లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నట్లయిందనే విమర్శలు వస్తున్నాయి, ఇప్పటివరకు సుమారుగా ముఫ్పై లక్షల పైచిలుకు ఆదాయాన్ని కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. గోదాం నిర్వహణ లేకపోగా, శిథిలావస్థకు చేరి మొదటికే మోసం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ గోదాం అద్దెకిచ్చి, జిల్లా సమాఖ్యకు ఆదాయ వనరులు సమకూర్చేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
గోదాంను అద్దెకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం : శ్రీధర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి, కరీంనగర్
గతంలో అద్దెకు తీసుకున్న సివిల్ సప్లై శాఖతో పాటు ప్రైవేటు సంస్థల అద్దె భారంతో యజమానులు గోదాం ఖాళీ చేశారు. ఈదురు గాలులకు పైకప్పు ధ్వంసమైతే మరమ్మత్తులు చేయించాం. గోదాంను అద్దెకిచ్చేందుకు సిద్ధం చేశాము. గోదాములో చేసే నిల్వలకు అనుగుణంగా అద్దె చెల్లింపులకు ఎవరూ ముందుకు రావటం లేదు. గోదాము ఎవరికైనా అవసరముంటే నేరుగా వచ్చి తమను సంప్రదించి అద్దెకు తీసుకోవచ్చు.