Ramagundam | కోల్ సిటీ, ఆగస్టు 1 : రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేటర్ల వెయిటింగ్ హాల్ (ప్రత్యేక గది) ఏర్పాటుకు క్లియరెన్స్ లభించింది. అధికార యంత్రాంగం దిగి వచ్చింది. అసమ్మతి కార్పొరేటర్ల పంతం నెగ్గింది. ఈమేరకు శనివారం వెయిటింగ్ హాల్ పునరుద్ధరణ చర్యలకు ఉపక్రమించింది. కాగా, కార్యాలయంలో కార్పొరేటర్ల వెయిటింగ్ హాల్ ను ఎత్తివేయడంపై ఇటీవల కాలంగా సుమారు 35 మంది కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా కూటమిగా ఒక్కటయ్యారు. నగర పాలక అధికారుల తీరుపై నిరసనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో సకల వసతులతో ఉన్న వెయిటింగ్ హాల్ ను ఉన్నపలంగా ఎత్తివేసి కార్పొరేటర్లను అవమానపర్చడంతో పాటు వివిధ పనుల నిమిత్తం కార్యాలయంకు వస్తే అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ ఆందోళన ప్రదర్శించారు.
వెంటనే వెయిటింగ్ హాల్ పునరుద్ధరించాలని పట్టుబట్టారు. అధికారులకు, కార్పొరేటర్లకు మధ్య ఈ అంశం వివాదంగా మారింది. హైదరాబాద్ లో శిక్షణ తరగతులను బహిష్కరించడంతో పాటు మూడు రోజుల క్రితం మేడారం వేదికగా అసమ్మతి కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ఈ క్రమంలో కార్యాలయంలో వెయిటింగ్ హాల్ ను పునరుద్ధరించేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. గతంలో ఉన్న గదిని కేటాయిస్తూ బోర్డును ఏర్పాటు చేశారు. వెయిటింగ్ హాల్ లో వివిధ వసతుల కోసం మరమ్మతు పనులు ప్రారంభించారు. ఐతే నిన్నటి వరకు పూర్తి వసతులతో ఉన్న గదికి మళ్లీ మరమ్మతుల పేరిట ప్రజాధనంతో దుబారా ఖర్చులు చేస్తున్నారని పలువురు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.