రవీంద్రభారతి, అక్టోబర్ 2: సీఎం రేవంత్‌రెడ్డి కులపిచ్చి పరాకాష్టకు చేరిందని, తాజాగా రెండు ఎమ్మెల్సీ స్థానాలను తన సొంత సామాజిక వర్గానికే ఇచ్చుకునేదాకా పెరిగిందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో శుక్రవారం 14 బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల ముఖ్య సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. ఆ రెండు ఎమ్మెల్సీ సీట్లను బీసీలకు కేటాయించకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతామని హెచ్చరించారు.
రేవంత్ సర్కార్ పచ్చి బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలను అణచి వేస్తున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో 260 గురుకుల పాఠశాలను నెలకొల్పారని, హాస్టళ్లలో సన్నబియ్యం పథకం అమలు చేశారని, విదేశీ విద్యాపథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనకే దక్కిందని కొనియాడారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి బీసీల కోసం ఒక్క పథకం తేలేదని, కనీసం ఒక్క కాలేజీ హాస్టల్ కూడా మంజూరు చేయలేదని దుయ్యబట్టారు. సమావేశంలో నాయకులు సతీశ్‌కుమార్, రామ్‌దేవ్ , రాజేందర్, భీమ్రాజ్, నిఖిల్, ఓబులేశ్ పాల్గొన్నారు.