Vemulawada | వేములవాడ, మార్చి 2: మున్సిపల్ పాలకవర్గంలో చైర్మన్ పదవి పంపకాలు జరిగినట్లుగా వస్తున్న ఆరోపణలపై స్పష్టతను ఇవ్వాలని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. చెల్మెడ నివాసంలో ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరి 16న పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని పదవులను కట్టబెడితే వాటిని అలంకారప్రాయంగా వాడుకుంటూ అభివృద్ధిపై సమావేశాలు నిర్వహించేందుకు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
పాలకవర్గంపై ప్రజలు పెట్టుకున్న గంపెడు ఆశల అభివృద్ధిపై ఎందుకు కౌన్సిల్ సమావేశం పెట్టి ముందుకు రావడంలేదని ఆమె ప్రశ్నించారు. దీనిపై వేములవాడ పట్టణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి పంపకంలోనూ వస్తున్న ఆరోపణలపై కూడా ప్రజలకు స్పష్టతనివ్వాలని ఆమె అన్నారు.
ఈ సమావేశంలో కౌన్సిలర్ వాసాల లావణ్య, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, నాయకులు రామతీర్థపు రాజు, క్రాంతి కుమార్, గూడూరి మధు, కొండ కనకయ్య, వెంగళ శ్రీకాంత్ గౌడ్, కనకరాజు యాదవ్, రాజేశం, సందీప్, గోపు మధు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.