రాంనగర్, అక్టోబర్ 11 : జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లా ఎన్నికల అధికారి, ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా ఓటు హకును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తామన్నారు.
జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 1338, సాధారణ పోలింగ్ స్టేషన్లు 1048, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 290 ఉన్నాయన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 36 బైండోవర్ కేసులు కాగా, 128 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. గతంలో ఎలక్టోరల్ నేరాలకు పాల్పడిన, సహకరించిన వారిని బైండోవర్ చేశామని, రౌడీ షీట్ కలిగిన వారిని కూడా ముందస్తుగా బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 33 లిక్కర్ కేసులు నమోదు కాగా, 418.243 లీటర్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటి విలువ రూ. 2,17,335 ఉంటుందన్నారు. రూ.4 లక్షల 50 వేలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నాకాబందీలు
జిల్లాలో 23 నాకా బందీలు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లా సరిహద్దుల్లో ఉన్న 5 ప్రాంతాల్లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా 5 అంతర్ జిల్లా చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ముగ్దుంపూర్, అర్నకొండ (చొప్పదండి మండలం), రేణికుంట (కొత్తపల్లి మండలం), పరకాల ఎక్స్ రోడ్, (హుజూరాబాద్ మండలం), సిరిసేడు (ఇల్లంతకుంట మండలం) చెక్ పోస్ట్‌ల ద్వారా అక్రమ రవాణారె అడ్డుకుంటామని చెప్పారు.
రంగంలోకి టాస్ ఫోర్స్ టీంలు
జిల్లాలో ఏదేని ప్రదేశంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన లేదా శాంతి భద్రతల చర్యలకు విఘాతం కలిగించే చర్యలను వేగవంతంగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏసీపీతో కూడిన ప్రత్యేక టీంలను 24 గంటలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వీటితోపాటు అదనంగా సాయుధ పటాలం నుంచి టీంలు, ఒకో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఇన్చార్జిలను కేటాయించామన్నారు.
సర్వేలైన్స్ టీంలు ..
స్టాటిక్ సర్వై లైన్స్ టీంలు 14, ఫ్లయింగ్ సర్వైలెన్స్ టీంలు 14, వీడియో సర్వే లైన్స్ టీం నాలుగు ఉంయాన్నారు. వీటితోపాటు మండలానికో మోడల్ కండక్ట్ నియమావళిని పర్యవేక్షించే కమిటీలో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు సభ్యుడిగా ఉంటారని చెప్పారు.
లైసెన్స్డ్ ఆయుధాల డిపాజిట్
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిననుసరించి లైసెన్స్ కలిగిన ఆయుధాలపై అండర్ సెక్షన్ 144 సీఆర్పీసీ అనుసరించి నిషేధాజ్ఞలు జారీ చేశామన్నారు. ఇప్పటికే 24 ఆయుధాలు డిపాజిట్ చేశారని, మిగతావి కూడా డిపాజిట్ అవుతాయని తెలిపారు.
సోషల్ మీడియా పై నిఘా
అనవసరమైన విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే లేదా ఇతరులను కించపరిచే విధంగా ఉండే పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకునేందుకు ఐటీ కోర్ టీం సభ్యులతో కూడిన స్పెషల్ టీం ను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా వాట్సాప్ గ్రూప్ లేదా ఇతర సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు వాటి గ్రూప్ అడ్మిన్లు బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు.
సిబ్బందికి శిక్షణ ..
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందికి ఎన్నికల నియామవళి, విధులు, ఎస్వోపీ పనుల గురించి శిక్షణ ఇచ్చామని తెలిపారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఫిర్యాదులను వేగవంతంగా సంబంధిత అధికారులకు తెలియజేసి, పరిష్కరించేందుకు జిల్లా హెడ్ క్వార్టర్ నందు 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా ప్రజలు, ఓటర్లు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ నియమావళిని పాటిస్తూ ఓటు హకును వినియోగించుకోవాలని కోరారు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.