గ్రామీణ విద్యార్థులను పట్టణ ప్రాంత విద్యార్థులకు ధీటుగా తీర్చిదిద్దుతున్నది సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కేంద్రం(సీఐటీడీ). కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో రూపుదిద్దుకోగా, కొన్ని నెలల కిందటే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక సౌకర్యాలున్న ఈ కేంద్రంలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందుబాటులో ఉన్న కోర్సులు, అర్హతలు, వాటిలో ప్రవేశం పొందే విధానం, శిక్షణ తర్వాత విద్యార్థులకు అందించే సేవలు, ఇతర అంశాలపై ప్రత్యేక కథనం.
– కరీంనగర్ ముకరంపుర, డిసెంబర్ 22
హైదరాబాద్ తర్వాత కరీంనగర్ వేగంగా విస్తరిస్తున్నది. విద్య, వైద్య సంస్థలతోపాటు ఇంజినీరింగ్, డిప్లొమా కళాశాలలు, పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. అయితే, వీటన్నింటి నుంచి ఏటా వేలాదిమంది పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ, సరైన నైపుణ్యం కొరవడి చదువుకు తగ్గ ఉద్యోగాలు సాధించలేక విఫలవుతున్నారు. ఈ నేపథ్యంలో యువతకు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వివిధ అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించి సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్నది. హైదరాబాద్ కేంద్రానికి అనుబంధంగా జిల్లా కేంద్రంలో సీఐటీడీ విస్తరణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఈ సెంటర్ ఏర్పాటుకు అన్ని విధాలుగా కృషి చేసింది. శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ ప్రాంగణంలో కేటాయించిన 1.20 ఎకరాలలో ఆధునిక సౌకర్యాలతో భవనాలు నిర్మించారు. కొద్ది రోజుల క్రితం పూర్తి స్థాయిలో కేంద్రం అందుబాటులోకి రావడంతో శిక్షణా కార్యక్రమాలు మొదలయ్యాయి. మ్యాను ఫ్యాక్చరింగ్తోపాటు వివిధ విభాగాల్లో శిక్షణ పొందిన వారికి విసృ్తతమైన ఉపాధి అవకాశాలు తలుపు తడుతున్నాయి. బహుళ జాతి సంస్థలు ఇకడ శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కొంత మంది సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ ఉపాధి కల్పించే స్థితికి చేరుకున్నారు.
ఇంజినీరింగ్, డిప్లొమా, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సీఐటీడీ లో శిక్షణ పొందడానికి అర్హులు. విద్యార్థులు ఎంచుకున్న కోర్సును బట్టి నిర్ణీత ఫీజును వసూలు చేస్తారు. కొన్ని కోర్సుల్లో శిక్షణ వ్యవధి నెల రోజులు ఉండగా మరికొన్ని కోర్సులకు 96 గంటల పాటు శిక్షణ ఇచ్చేలా రూపకల్పన చేశారు. ఇందులో కొన్ని కోర్సులు నేషనల్ సిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్స్(NSQF)కింద ఉన్నాయి. ఇందులో మ్యాట్ ల్యాబ్ (ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, సీఎస్ఈ, ఐటీ ఇంజినీరింగ్), ఆటో క్యాడ్-2డీ, 3డీ(ఐటీఐ సంబంధిత ట్రేడ్ లో అనుభవం, డిప్లొమా, డిగ్రీ(మెకానికల్ ఇంజినీరింగ్ తత్సమాన అర్హత), సీఆర్ఈవో పారామెట్రిక్ డిప్లొమా, డిగ్రీ(మెకానికల్ ఇంజినీరింగ్ తత్సామాన అర్హత), సాలిడ్ వర్స్(డిప్లొమా, డిగ్రీ(మెకానికల్ ఇంజినీరింగ్ తత్సామాన అర్హత) కోర్సులు ఉన్నాయి.
తరగతి గదిలో బోధనతో పాటు ల్యాబ్లో సాధన కోసం హైఎండ్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా విద్యార్థులకు ప్రయోగాత్మక విధానంలో సాధన చేయిస్తారు.
సీఐటీడీలో శిక్షణ పొందిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంజినీరింగ్ విద్యార్థులకు వివిధ అంశాల్లో నిపుణులైన బోధనా సిబ్బంది, తరగతి గది బోధనతో పాటు అత్యాధునిక ల్యాబ్లో ప్రాక్టీస్ ద్వారా సబ్జెక్ట్, సిల్స్పై పూర్తి అవగాహన వస్తుంది. బహుళ జాతి సంస్ధల్లోనూ సులువుగా కొలువులు పొందేలా శిక్షణ ఉపయోగ పడుతుంది. మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి రాబోయే రోజుల్లో అత్యాధునిక సీఎన్సీ మెషిన్లపై అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
– ఎస్ రామకృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్, సీఐటీడీ, కరీంనగర్