Veenavanka | వీణవంక, ఫిబ్రవరి 24 : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy)పై పోలీసులు నమోదు చేసిన కేసులపై సీఐడీ (CID) అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. అధికారుల కథనం ప్రకారం.. వీణవంక మండల కేంద్రంలో గత నెలలో జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతర లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ స్థానిక పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పలు కేసులు నమోదు చేశారు. అయితే ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి బదిలీ చేయగా మంగళవారం సీఐడీ డీఎస్పీ రంగస్వామి తన బృందంతో కలిసి విచారణ చేపట్టారు.
సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, జాతర జరిగిన స్థలం పక్కనే ఉన్న ఇంటి యజమాని మోటం సారయ్య, జాతరలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న చిరువ్యాపారులను స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ సందర్భంగా సీఐడీ అధికారులు విచారించారు. ఇక్కడ హుజూరాబాద్ ఏసీపీ మాధవి, ఎస్ఐ ఆవుల తిరుపతి, సీఐడీ అధికారులు ఉన్నారు.
మండల కేంద్రంలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతరకు తనను, తన కుటుంబ సభ్యులను వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారని ఇటీవల హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాగా ఎమ్మెల్యేపై పెట్టిన కేసులపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టడం మండలంలో చర్చనీయాంశంగా మారింది.