గంగాధర, అక్టోబర్ 16 : సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టో మానవీయ కోణంలో ఉందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బూరుగుపల్లిలో సోమవారం ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనను సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేను చేశారన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో కార్యకర్తలందరూ ఒక్కతాటిపై ఉండి పని చేసినట్లే ఈసారి కూడా పనిచేసి బీఆర్ఎస్ విజయానికి సహకరించాలని కోరారు. చొప్పదండి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు లేవని, ఉన్నది కేసీఆర్ గ్రూప్ ఒక్కటేనని స్పష్టం చేశారు. మోతె కాలువ, ఓటీల నిర్మాణానికి రూ.250 కోట్లు మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు.
నారాయణపూర్ ప్రాజెక్టులో భాగంగా మంగపేట నిర్వాసితులకు పరిహారం ఇప్పించామని, నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నారాయణపూర్ కుడికాలువ పనులు 90 శాతం పూర్తయినట్లు తెలిపారు.
నియోజకవర్గంలో 52 గ్రామ పంచాయతీ భవనాలు, 54 పల్లె దవాఖానల భవనాలకు నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. ఒద్యారం నుంచి కొదరుపాక, కొదురుపాక నుంచి గంగాధర వరకు రూ.32 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం, గంగాధర మండల కేంద్రానికి వెళ్లే దారిలో డబుల్ రోడ్డు వేయించినట్లు తెలిపారు.
చొప్పదండిలో 30 పడకల దవాఖాన మంజూరు చేయించినట్లు వెల్లడించారు. రూ. 120 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అట్లర్ ఫ్లాప్ అన్నారు. తెలంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడంలో లేదో చెప్పి ఆ పార్టీ నాయకులు ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. చొప్పదండి మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, గంగాధర, జడ్పీటీసీ మార్కొండ లక్ష్మీకృష్ణారెడ్డి, కొడిమ్యాల విండో చైర్మన్లు బాలాగౌడ్, మెన్నేని రాజనర్సింగారావు, సర్పంచులు ఫోరం మండలాధ్యక్షుడు గంగాధర్, కృష్ణారావు, బీఆర్స్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, గంట్ల జితేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.