రామడుగు, మార్చి 17: రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం దేశరాజ్‌పల్లి గ్రామానికి చెందని ఓ అన్నదాత కుటుంబానికి రూ. 5 లక్షల రైతు బీమా ప్రొసీడింగ్ పత్రాన్ని శుక్రవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే ఏ నిర్ణయమైనా దేశ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు ద్వారా ఎకరాకు రూ. 10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న మనసున్న దేవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కాళేశ్వరం జలాలతో రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్కు కార్యకర్తలే మూల స్తంభాలు అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. దేశరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఊరడి సుదర్శన్ ఇటీవల కరెంట్‌షాక్‌తో మృతి చెందగా, ఎమ్మెల్యే వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున రూ. 2 లక్షల విలువైన బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తిరుపతి, ఎంపీటీసీ వంచ మహేందర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్, మాజీ ఎంపీపీ తవుటు మురళి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎల్కపెల్లి లచ్చయ్య, మాజీ ఎంపీటీసీ దొబ్బల మధు, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు చంద్రయ్య, రాకేశ్, గౌసొద్దీన్, వెంకటేశ్, శ్రీకాంత్, ఏఈవో రమేశ్ పాల్గొన్నారు.