Government schools | కాల్వ శ్రీరాంపూర్ మే 3 : ప్రభుత్వ పాఠశాలలు పల్లె ప్రాంతాలకు ప్రగతి రథ చక్రాల్లాంటివని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని శ్రీరాంపూర్ ఎంఈఓ సిరిమల్ల మహేష్ అన్నారు. పల్లెల్లో అజ్ఞానాన్ని పారదోలి విజ్ఞానాన్ని పంచుతూ వాటి అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఆయన కూనారం వేసవి బడి కేంద్రాన్ని శనివారం సందర్శించారు. పిల్లల్ని ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు. పిల్లలతో ముచ్చటించారు.
అనంతరం మాట్లాడుతూ పిల్లలకు నమ్మకంగా ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని అద్భుతంగా తయారు చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు ఇటీవల వెలువడిన ఎస్సేస్సీ పబ్లిక్ పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరచి మండలంలోనే టాపర్లుగా నిలవడం ఇందుకు చక్కని ఉదాహరణ అని ఆయన అన్నారు. తల్లిదండ్రులు డబ్బులు వృధా చేసుకోకుండా పిల్లల్ని తమ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఎంఈఓ మహేష్ కోరారు. ఇందులో వాలంటీర్, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.