Kappathalli | గంగాధర, జూన్ 22: ఆకాశం మబ్బులు పట్టినట్టే పడుతోంది.. ఆ వెనకే మెండుగా ఎండలు కాస్తున్నాయి.. 15 రోజుల క్రితం మురిపిచ్చిన వర్షాలు ముఖం చాటేశాయి. ఏరువాక ప్రారంభమై పది రోజులు గడిచినా చినుకుల సప్పుడే లేదు. 15 రోజుల క్రితం వానలు పట్టడంతో పత్తిత్తులు పెట్టిన రైతులు ఆపై వానలు కురవకపోవడంతో పదనలేక వేసిన విత్తనాలు మట్టిలోనే కలిసిపోయే పరిస్థితి వచ్చింది. పంటలు సాగు చేసిన రైతులు వానలు ఎప్పుడొస్తాయా అని ఆకాశం వైపు చూసుడే అవుతోంది. వర్షాలు కురవక ఉసురుమన్న రైతులు వానల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్న పల్లి గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ చిన్నారులు కప్పతల్లి ఆట ఆడారు. డప్పు చప్పులతో గ్రామంలో ఇంటింటికి వెళ్లి వానలు కురవాలని వాన దేవుని ప్రార్థించారు. గ్రామస్తులు కప్పతల్లి ఆడే వారిపై నీళ్లు పోసి తొందరగా వర్షాలు కురవాలని వాన దేవుని ప్రార్థించారు.
ఈ ఏడాది తొందరగానే వర్షాలు కురుస్తాయి అని ఆశించామని, ముందే మురిపించిన వర్షాలు ఆ తర్వాత జాడ లేకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు వర్షాలు కురవడంతో ఇప్పటికే దుక్కులు దీన్ని విత్తనాలు పెట్టామని, ఇప్పుడు వానలు కురువక విత్తనాలు మొలకెత్తక మొదటికే నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. తమ వంతు మానవ ప్రయత్నంగా తొందరగా వర్షాలు కురవాలని కప్పతల్లి ఆడుతూ వాన దేవునికి మొక్కుతున్నట్లు రైతులు తెలిపారు. మరి రైతుల మొరవిని ఆ వాన దేవుడు తొందరగా వర్షాలను కురిపిస్తాడో లేదో చూడాలి.