పెద్దపల్లి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): మంథని నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. గత వారం రోజుల్లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వరుసగా మూడు సార్లు కలిసి విజ్ఞప్తి చేయడం తో నియోజకవర్గంలోని తూర్పు డివిజన్ అటవీ ప్రాంత మండలాల ప్రజల అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మంథని నియోజకవర్గం, నాడు అభివృద్ధికి ఆ మడ దూరంలో ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత మంథని నియోజకవర్గంలోని సగభాగమైన మానేరు అవతలి ప్రాంతమైన మహాదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాలతోపాటు కొత్తగా పలిమెల మండలా న్ని ఏర్పాటు చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలిపారు.
మానేరు ఇవతల మంథని, కమాన్‌పూర్, ముత్తారం మండలాలతో పాటు కొత్తగా రామగిరి మండలాన్ని ఏర్పాటు చేసి పెద్దపల్లి జిల్లాకు అనుసంధానం చేశారు. దీంతో మంథని నియోజకవర్గం రెండు జిల్లాల్లో విస్తరించి ఉంది. గత ప్రభుత్వాల హయాంలో మంథని నియోజకవర్గం ముఖ్యమంత్రి, స్పీక ర్, మంత్రులను అందించగా, అభివృద్ధికి మా త్రం ఆమడ దూరంలోనే ఉండేది. కానీ, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంథని నియోజకవర్గ అభివృద్ధికి బాటలు పడ్డాయి. మంథని మాజీ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చొరవతో అభివృద్ధిలో జెట్ స్పీడుతో దూసుకుపోతున్నది.
ఫలిస్తున్న మధు కృషి
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మంథని నియోజకవర్గంపై ప్రధాన దృష్టి సారించారు. రాబోయే మంథని అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికైన ఆయన, ఆది నుంచీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తరచుగా సీఎం కేసీఆర్‌ను కలుస్తూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. కాటారం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరగా, శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నవీన్‌మిట్టల్ ప్రిలిమినరీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో జయశంకర్ భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాలతో కాటారం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటవుతున్నది. అలాగే రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని మధూకర్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్.. పెద్దపల్లి-కాటారం ప్రధాన రహదారి అభివృద్ధి, దెబ్బతిన్న మంథని-ఓడేడ్, ఎక్లాస్పూర్-ఖమ్మంపల్లి, పీడబ్ల్యూడీ రోడ్ టూ వెంకటాపూర్ వరకు రోడ్ల అభివృద్ధి, మరమ్మతులకు నిధులు కేటాయించాలని ఆర్అండ్బీ శాఖను ఆదేశించారు.
త్వరలోనే గుంజపడుగు, బోర్లగూడెం మండలాలు
మంథని మండలం నుంచి కొత్తగా గుంజపడుగు మండలాన్ని, మహాముత్తారం మండలం నుంచి కొత్తగా బోర్లగూడెం కేంద్రంగా మండలాలను ఏర్పాటు చేయాలని కోరగానే, కేసీఆర్ సానుకూలంగా స్పందించారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తెలిపారు. ఈ క్రమంలో రెండు, మూడు రోజుల్లో గుంజపడుగు, బోర్లగూడెం కేంద్రంగా కొత్త మండలాల ఏర్పాటు ఉత్తర్వులు రానున్నట్లు జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తెలిపారు.