తెలంగాణ చౌక్, జూలై 24 : అత్యాధునిక మౌలిక వసతులతో సిరిసిల్ల గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాగున్నదని సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుడు సోమేశ్‌కుమార్ కితాబిచ్చారు. సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో పాఠశాల ప్లేగ్రౌండ్, స్టాఫ్‌రూం, తరగతి గదులను, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. పాఠశాల పూర్వస్థితి, మంత్రి కేటీఆర్ చొరవతో మారిన సౌకర్యాలను, పెరిగిన విద్యార్థుల సంఖ్య గురించి కలెక్టర్ అనురాగ్ జయంతిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల మొత్తం కలియతిరిగి విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతుల రూపకల్పనపై ఆరా తీశారు.
విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల పునరుద్ధరణకు ముందు 570 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం 980 విద్యార్థులు చదువుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. మెరగైన వసతులు అందుబాటులో ఉండడం వల్ల ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరగడంపై సోమేశ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. విద్యాబోధన, సౌకార్యలు రూపకల్పనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా పాఠశాలలో ఏమైనా సదుపాయలు కావాలా? అడుగుగా, అన్నీ ఉన్నాయని విద్యార్థులు బదులిచ్చారు. ఇక్కడ కలెక్టర్‌తో పాటు ఎస్పీ అఖిల్ మహాజన్, డీఈవో రమేశ్‌కుమార్, ఎంఈవో దూస రఘుపతి ఉన్నారు.