ODELA | ఓదెల, ఆగస్ట్ 8 : ఆధునిక పోకడలతో గ్రామీణ ప్రాంత ప్రజల జీవనశైలి మారుతూ వచ్చి పట్టణ సంస్కృతి నెలకొంటుంది. గ్రామాల్లో గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు గేదెలు, ఆవులు( పశువులు) లను మేపేందుకు కాపర్లు ఉండేవారు. అయితే కాలక్రమేనా ఆ వృత్తి అంతరించిపోతోంది. గతంలో గ్రామాల్లో రైతులు, ప్రజల ఇళ్లలో బర్రెలు, ఆవులు పెంచుకుంటుండేవారు. వాటిని ప్రతీరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పశువుల కాపర్లు మైదాన ప్రాంతాలు, గుట్టల పరిసర ప్రాంతాలకు తీసుకువెళ్లి మేపుతుండేవారు.
దీంతో గ్రామాల్లో రైతులు, ప్రజలకు స్వచ్ఛమైన పాలు, పెరుగు దొరుకుతుండే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో కూడా బర్రెలు, ఆవులు తగ్గిపోయి పాలు, పెరుగు ప్యాకెట్లను పట్టణ ప్రజల మాదిరిగా దుకాణాల్లో కొనుక్కునే పరిస్థితికి అలవాటు పడిపోతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పలు కులవృత్తులు అంతరిస్తుండగా, అందులో పశువుల కాపరి వృత్తి కూడా అంతరిస్తున్నట్లు గ్రామీణులు పేర్కొంటున్నారు. ఉన్న కొద్దో గొప్పో పశువులను ఇండ్ల వద్ద ఉంచుకొని మేపుకుంటుండగా, మరికొందరు వారికి ఉన్న పశువులను మైదాన ప్రాంతాలకు తీసుకువెళ్లి మేపుకుంటున్నారు. మండలంలోని పలు గ్రామాలను సందర్శించినప్పుడు ఇండ్ల వద్దనే పశువులను కట్టేసి ఉన్న దృశ్యాలు కనిపించాయి.