Chandi Yagam | సిరిసిల్ల రూరల్, నవంబర్ 28 : మహారాష్ట్రలోని భీవండి లో ఈనెల 29 నుంచి’ నవకుండాత్మక రుద్ర సహిత చండీయాగం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ కు చెందిన శ్రీ సద్గురు బోడ భూమయ్య స్వామి ఆధ్వర్యం లో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ చండీయాగం ఈ నెల 29,30, డిసెంబర్ 1 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుంది.
చండీయాగంలో 101 జంటలు పాల్గొననున్నాయి. డిసెంబర్ 1 న గీతా జయంతిని పురస్కరించుకొని ఈ చండీయాగంను నిర్వహిస్తున్నారు. చండీయాగాన్ని తెలంగాణకు చెందిన ప్రముఖ భక్తి టీవీ దీపోత్సవ పురోహితులు చండీయాగ రుత్వికులు బ్రహ్మశ్రీ రేవల్లి రాజు శర్మ, బృందం తో చండీయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బస్వాపూర్ నుంచి మహారాష్ట్ర కు..
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండలం బస్వాపూర్ కు చెందిన శ్రీ సద్గురు బోడ భూమయ్య స్వామి ఉన్నత విద్యాబ్యాసం చేసి, ఉపాధి కోసం మహారాష్ట్రలోని ముంబైకి వెళ్లారు. అక్కడ వస్త్ర పరిశ్రమను నిర్వహించారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. కాల క్రమేనా ఆధ్యాత్మికత వైపు పయనించారు. వస్త్ర పరిశ్రమ నిర్వహిస్తూనే గీతా జయంతి లో పాల్గొనేవారు.
అక్కడ శ్రీ సద్గురు శ్రీ శ్రీ శ్రీ మాధవ స్వామి తో ఉంటూ ఆయన ప్రియ శిష్యుడిగా మారాడు. తర్వాత ముబాయి నుంచి భీవండికి చేరుకొని, భీవండిలోని నార్పోలిలో బాలాజీనగర్, గంగారాం వాడీలో శ్రీ మద్భగవద్గితా భక్త మండలిని స్థాపించారు. ఈ ఆశ్రమంలో గీతా ప్రచారం, పరాయణం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తో 25వ గీతా జయంతి రజతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
మూడు రోజుల పాటు నిర్వహణ..
శ్రీ మధ్భగవద్గిత భక్త మండలి 25 వ గీతా జయంతి రజతోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు నవకుండాత్మక రుద్ర సహిత చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ నెల 29 న యాగం ప్రారంభమవుతుంది. 101 జంటలతో యాగం నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగిన తర్వాత, మూడో రోజు గీతా జయంతి న యాగం ముగుస్తుంది. శ్రీ మధ్భగవధ్గీత భక్త మండలి ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తారు. ఈ యాగానికి తెలంగాణలో పలు జిల్లాల నుంచి భక్తులు తరలివెళ్తున్నారు .