కరీంనగర్ తెలంగాణ చౌక్, ఫిబ్రవరి 18 : ఆర్టీసీ రక్షణతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఆ సంస్థ జేఏసీ పోరుబాట పడుతున్నది. ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సర్కారుపై సమరానికి సిద్ధమవుతున్నది. అందులో భాగంగా ఈ నెల 24న ‘చలో సెక్రటేరియట్’ను చేపడుతున్నది. బుధవారం కరీంనగర్ బస్టాండ్ ఆవరణలోని డిపో-1 ఎదుట ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
అనంతరం ‘చలో సెక్రటేరియట్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా థామస్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని, సంస్థను ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారని సర్కారును ప్రశ్నించారు. గతంలో సమ్మెకు దిగితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి రాగానే చేతులెత్తేశారని, సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు.
ఉద్యోగులను వంచించాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 24న నిర్వహిస్తున్న చలో సెక్రటేరియట్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తమ పోరాటాన్ని ప్రభుత్వం అణిచివేయాలని కుట్రలు చేస్తే జైల్‌భరోకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకుడు కాళిదాస్, జిల్లా చైర్మన్ ఎంపీ రెడ్డి, నాయకులు జిపిసింగ్, మనోహర్‌తోపాటు ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.