Huzurabad | హుజూరాబాద్, ఫిబ్రవరి 20 : ఉద్యోగుల సమస్యల సాధనకై ఈనెల 24న చలో సెక్రటేరియట్ ధర్నా పోస్టర్‌ను హుజురాబాద్ డిపో ముందు ఆర్టీసీ జేఏసీ కార్మికులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండు చేశారు. 2021 సంవత్సరం ఉద్యోగుల పేస్కేల్‌ను శాశ్వతంగా 30 శాతం అమలుపరచి, మా లక్ష్మి పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు.
ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలని, మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, వీటితోపాటుగా ఇతర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకై కార్మికులందరు కలిసికట్టుగా చలో సెక్రటేరియట్ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ టీఎస్ సింగ్, కో చైర్మన్ సాధుల కిషోర్, నాయకులు అంబాల రాజు, పీ రాంబాబు, ఏం ఆశోక్, కే వెంకన్న, వీ తిరుపతి, వీరయ్య, కమలాకర్, జీ శ్రీనివాస్, పీ యాదగిరి, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.