వేములవాడ/కరీంనగర్ కార్పొరేషన్/మెట్పల్లి/కరీంనగర్ తెలంగాణచౌక్/కోల్‌సిటీ, డిసెంబర్ 20: సమస్యల పరిష్కారం కోసం చలో అస్లెంబీకి బయలుదేరిన ఆటో యజమానులు, డ్రైవర్లను శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో హైదరాబాద్‌కు వెళ్తున్న ఆటో కార్మికులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఉపాధిలేక ఇప్పటివరకు 72మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అక్రమ అరెస్ట్‌లతో కార్మికులను ఆపుతున్నారు గానీ.. తమ ఆకలికేకలను అర్థం చేసుకోవడం లేదని వారు వాపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం ఆటో డ్రైవర్లకు రూ.12వేల భృతి కల్పించాలని, ఆటో డ్రైవర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆటోలకు ఇన్సూరెన్స్ చేయించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా హైదరాబాద్ వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేయడమే ప్రజా పాలననా అని ప్రశ్నించారు. కుటుంబాలను పోషించలేక డ్రైవర్ల నానా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం మాత్రం చర్చలు జరుపుతామని హామీలు ఇస్తూ దాటావేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హామీలు అమలు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.