వేములవాడ, అక్టోబర్ 7: ‘అది చేస్తాం.. ఇది చేస్తామంటూ వస్తున్న కాంగ్రెస్‌తో రాష్ర్టానికి ఒరిగేదేం లేదు. ఈ ప్రాంతాన్ని ఏండ్లకేండ్లు పాలించినా చేసిందేమీ లేదు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతే. ఏ ఒక్క పనీ చేయడం లేదు. ఈ రెండు పార్టీలతో తెలంగాణకు ప్రమాదం. ప్రతిపక్షాల మాయమాటలను నమ్మితే మోసపోతం. గోసపడుతం’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలకు ప్రజలను నిండా ముంచుడు తప్ప మరేం చేతగాదని, వాళ్ల నమ్మి మోసపోవద్దని సూచించారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని, ప్రజలను కంటికి రెప్పలా కాపాడే కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా చేయాలని పిలుపునిచ్చారు. వేములవాడలో చల్మెడ లక్ష్మీనర్సింహారావును భారీ మోజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో వేములవాడ పట్టణం, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లోని లబ్ధిదారులకు బీసీ బంధు, గృహలక్ష్మి పట్టాలు, క్రీడా సామగ్రి, దివ్యాంగులకు బైక్‌లను ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావుతో కలిసి అందజేశారు. అలాగే కోనాయపల్లి శివారులో డబుల్ బెడ్రూం ఇండ్లకు భూమిపూజ చేశారు. అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడారు. రాబోయే అరవై రోజులు కార్యకర్తలకు చాలా కీలకమని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ వచ్చి కేసీఆర్ మీద, ఆయన కుటుంబసభ్యులపై ఆరోపణలు చేస్తాయని, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తాయని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
నాడు రాష్ట్రం ఏర్పడితే రైతులకు కరెంట్ ఉండదని, తెలంగాణ గోస పడుతుందని కాంగ్రెస్ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలను స్వరాష్ట్రంలో పటాపంచలు చేశామని, రాష్ట్ర రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి ఆయన మాటలు తప్పు అని నిరూపించామని స్పష్టం చేశారు. సమైక్య పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదని, కరెంటు కోసం అర్ధరాత్రి బాయిల కాడ పడుకునేటోళ్లని, ఇప్పుడా ఆ పరిస్థితి లేదని, ఇదంతా సీఎం కేసీఆర్ ఘనతేనని చెప్పారు. ఈ విషయంపై మనం గ్రామాల్లో చర్చించాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ వస్తే తెలంగాణలో రైతులకు ఒరిగేదేం లేదన్నారు. సీఎం వ్యవసాయాన్ని పండుగలాa మార్చారని, ఎత్తిపోతల పథకాలతో రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారని కొనియాడారు. కరీంనగర్ నుంచి ఇక్కడికి వస్తుండగా మధ్యలో మిడ్‌మానేరును చూస్తే కండ్ల ముందు గతం తిరిగిందని, అక్కడ ఒకప్పుడు ఇసుక తప్ప చుక్కనీరు ఉండేది కాదని, కానీ కేసీఆర్ పుణ్యమా అని బ్రిడ్జిపై నుంచి ప్రాజెక్టును చూస్తుంటే నిండుగా నీళ్లతో ఉందని హర్షం వ్యక్తం చేశారు. రమేశ్‌బాబు గుడిచెరువులో 365 రోజులు నీరు ఉండాలని సంకెపల్లి నుంచి పైప్ లైన్ వేయించారని చెప్పారు. రాజన్న ఆలయాన్ని 32 ఎకరాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మల్కపేట రిజర్వాయర్‌ను త్వరలోనే సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభిస్తారని, జలాశయానికి చెన్నమనేని రాజేశ్వర్‌రావు పేరు పెట్టినట్లు చెప్పారు. ఇక్కడ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థఫు మాధవి, ఎంపీపీ బూర వజ్రమ్మ, బండ మల్లేశం, జడ్పీటీసీలు మ్యాకల రవి, ఏశ వాణి, వైస్ ఎంపీపీ ఆర్సీ రావు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వేములవాడను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశా. వేములవాడ పట్టణ, వేములవాడ అర్బన్, రూరల్ మండలాల్లో కులసంఘాల భవనాలకు 2.24 కోట్లు మంజూరు చేయించుకొని పట్టాలు ఇస్తున్నాం. చాలెంజ్ చేసి చెబుతున్నా. వేములవాడ చరిత్రలో ఇంత అభివృద్ధి ఎవరూ చేయలేదు. వందల కోట్ల కార్యక్రమాలను నాకు ఇచ్చిన, ఈ ప్రాంతానికి 4800 ఇండ్లను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ నా ప్రత్యేక కృతజ్ఞతలు. గత పాలకులు భూ కబ్జాలు, అన్యాయాలు తప్ప అభివృద్ధి చేయలేదు. రాజన్న ఆశీస్సులతో సీఎం కేసీఆర్ బాగుండాలి. వందేళ్లు బతకాలి. ప్రతిపక్షాలు మాటలకు ఆగం కావద్దు. తెలంగాణకు సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి. మీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావును భారీ మెజార్టీతో గెలిపించాలి.
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు ఎన్నికలు వస్తున్నయనగానే ప్రతిపక్షాలు గ్రామాలమీదపడుతయి. అది చేస్తాం.. ఇది చేస్తాం అని అంటరు. వారు ఏండ్లకేండ్లు రాష్ర్టాన్ని, దేశాన్ని పాలించి చేసిందేమిటో ప్రజలే ఆలోచించాలి. ఇప్పుడు వారు చెప్పిన మాటలు నమ్మితే మోసపోతం. రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్‌ను గెలిపించాలి. నాకు ఒక సారి అవకాశం ఇచ్చి, ఆశీర్వదించండి. మీ బిడ్డగా స్థానికంగానే ఉంటూ సేవ చేస్తా.