Karimnagar | కలెక్టరేట్, మార్చి 23 : రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న చలానా డబ్బులు చెల్లించటంలో యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కరివి లక్షలాది రూపాయలు విలువ చేసే చలాన్లు, ఏడాదిన్నరగా పెండింగ్లో ఉండగా, తెచ్చిన అప్పులు తడిసి మోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థిరాస్తుల క్రయ విక్రయాల అనంతరం కొనుగోలుదారు తమ పేర రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇట్టి మొత్తాన్ని చలాన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. రిజిస్ట్రేషన్లు జరగని పక్షంలో సంబంధిత కార్యాలయ అధికారులు, చలానా ద్వారా ప్రభుత్వ ఖజానాకు జమ చేసిన మొత్తంలో 10 శాతం మినహాయించుకుని, మిగతా మొత్తాన్ని దరఖాస్తుదారుడుకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే గత కొన్ని నెలలుగా చెల్లించకుండా దరఖాస్తుదారుల విజ్ఞప్తులను పెండింగ్లో ఉంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సుమారు 1200కు పైగా దరఖాస్తులు ఇలా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 20 కోట్ల పైచిలుకు మొత్తం దరఖాస్తుదారులకు చెల్లించాల్సి ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చలాన తీసిన ఆరు నెలల్లోపు సంబంధిత వ్యక్తి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే, అధికారులు దానిని పరిశీలించి సదరు వ్యక్తికి చెల్లించాల్సిన మొత్తం, ఆయన వివరాలు ట్రెజరీ కార్యాలయానికి పంపుతారు. వాటిని పరిశీలించిన అనంతరం కోషాగార శాఖ నుంచి అందాల్సిన మొత్తం దరఖాస్తుదారుడి ఖాతాలో జమ అవుతుంది. ఆరు మాసాలు దాటితే రిజిస్ట్రేషన్ల శాఖ కంప్యూటర్ నుంచి దరఖాస్తుదారుడి వివరాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి.
దీనిపై అవగాహన లేని కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. కంప్యూటర్ నుంచి తొలగిపోయిన వారి వివరాలు ఆప్ లైన్లో ఆ శాఖ రాష్ట్ర కార్యాలయానికి పంపి, తిరిగి జిల్లాకు చేరే క్రమంలో కూడా జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏతా, వాతా బాలారిష్టాలు దాటి కోశాగార కార్యాలయానికి వెళ్లినా, వరుస క్రమంలో చెల్లింపులు చేయాల్సి రావటంతో నిధుల అందుబాటును బట్టి ఆర్బిఐ విడుదల చేస్తుండటం కూడా చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని బాధితులు కోరుతున్నారు.
మావద్ద పెండింగ్ లేవు: ప్రవీణ్ కుమార్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్
చలానా డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసు కోనివారి దరఖాస్తులు మావద్ద పెండింగ్ లేవు. తమ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు తీసుకొని, ట్రెజరీ ఆఫీసుకు పంపాము.