కార్పొరేషన్, అక్టోబర్ 24: ‘బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను విమర్శించే అర్హత నీకు లేదు. ఎంతసేపు మతం పేరిట యువతను రెచ్చగొట్టుడే తప్ప అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవా..?’ అని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ధ్వజమెత్తారు. కరీంనగర్‌లోని 37వ డివిజన్లో గల మీ కోసం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2006లోనే కేటీఆర్ ఉద్యమంలో పాల్గొన్నాడని, ఆ సమయంలో నువ్వు (బండి సంజయ్) ఎక్కడున్నవో అందరికీ తెలుసునన్నారు. 2009లో కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. ఉరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చిన ఘనత అమాత్యుడు రామన్నదేనని స్పష్టం చేశారు. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఈ తొమ్మిదిన్నర ఏండ్లలోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఎంపీగా నాలుగున్నర ఏండ్లుగా ప్రజలకు అందుబాటులో ఉండని నీకు, పెద్ద నాయకులను విమర్శించే అర్హత లేదన్నారు. ఆరోపణలు పునరావృతమైతే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఎంపీగా గెలిచి ఏం చేశావో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.? బీజేపీకి అభ్యర్థులు లేకనే ఎంపీలను అసెంబ్లీ బరిలో దింపుతున్నదని విమర్శించారు. గత ఎన్నికల్లో వందకు పైగా సీట్లల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందని ఎద్దేవాచేశారు. హిందుత్వం పేరిట యువతను రెచ్చగొట్టి ఇంకా ఎన్నాళ్లూ పబ్బం గడుపుకుంటావని నిలదీశారు. ఓటమి ఎరుగని నాయకుడు గంగుల కమలాకర్ అని స్పష్టం చేశారు. తిరుపతి దేవాలయాన్ని, ఇస్కాన్ టెంపుల్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థలు, మెడికల్ కళాశాల తెచ్చిన నాయకుడు గంగుల అని కొనియాడారు. ప్రభుత్వ దవాఖానను 500 పడకలుగా మార్చామని, బస్తీ దవాఖానలు ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో మరోసారి భారీ మెజార్టీతో గంగుల కమలాకర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గడ్డం ప్రశాంత్‌రెడ్డి, షౌకత్, చందు, నవాజ్, ఆరె రవిగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, వొడ్నాల రాజు పాల్గొన్నారు.