Chakali Ailamma | సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 28 : తెలంగాణ పోరాట స్ఫూర్తిప్రదాత చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడారు. ఆమె పోరాట స్పూర్తితోనే మలిదశ ఉద్యమం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాచరిక వ్యవస్థ చేసిన అరాచకంపై పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో ఐలమ్మ పోరాట చరిత్రను కేసీఆర్ ఆధారంగా చేసుకున్నారని. పేర్కొన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దేశానికే మార్గదర్శకంగా అభివృద్ధి చేశారని తెలిపారు, ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ మాజి చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ రజాకార్లను తరిమికొట్టడంలో చాకలి ఐలమ్మ కీలకభూమిక పోషించారని అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో ఐలమ్మ పోరాట చరిత్రను నేటి తరానికి అందించారని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర ఐలమ్మదేనన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీడీసీ మాజి చైర్మన్ గూడూరి ప్రవీణ్, మ్యాన రవి, కుంబాల మల్లారెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్, దార్ల సందీప్, కొండ శంకర్, మామిడాల రమణ, రిక్కుమల్లె సంపత్, అడిచర్ల సాయికృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.