కార్పొరేషన్, జూన్ 22: ‘కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని బీజేపీ ఇంటింటి కార్యక్రమం చేపడుతున్నది. ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్తడు’ అంటూ స్టేట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ నిప్పులు చెరిగారు. బీజేపీ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించే చెబుతారని పేర్కొన్నారు. ‘సీఎం కేసీఆర్ మంచి వ్యక్తి అని, ఆయన్ను కలిపించాలని 2014లో తనను కలిసి అడిగిన విషయం మరిచిపోయావా..? అంటూ ప్రశ్నించారు. అలాంటి ఆయన సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడం విడ్డూరమన్నారు. గురువారం కరీంనగర్‌లోని ఓ హోటల్లో రవీందర్‌సింగ్ విలేకరులతో మా ట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటేనని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో బండి సంజయ్ కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రచారం చేయలేదా? అంటూ నిలదీశారు. ఆ రెండు పా ర్టీల నాయకులు సహనం కొల్పోయి కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. ‘ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోం.ఖబడ్దార్’ అని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు ఒరిగిందేంటని విమర్శలు చేస్తున్నవారికి కేంద్రం తెలంగాణకు ఇచ్చిన అవార్డులే సమాధానమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుంటే కేంద్రం పురస్కారాలు ఎందుకు ఇస్తున్నదో బండి చెప్పాలని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, పెం డ్యాల మహేష్, దండబోయిన రాము పాల్గొన్నారు.