రైతుబాంధవుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మానవతా దృక్పథాన్ని చాటారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచారు. వడగండ్లతో దెబ్బతిన్న పంటలను గత నెల 23న క్షేత్రస్థాయిలో పరిశీలించి, దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు 10 వేల పరిహారం ప్రకటించిన ఆయన, కేవలం 28 రోజుల్లోనే చెల్లింపునకు ఆదేశాలిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ఖజానా నుంచే నిధులు విడుదల చేస్తూ రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఖాతాల్లోనే జమ కానుండగా, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారులు సర్వే చేసి చేతులు దులుపుకునేవారని, సాయం చేసే వారు కాదని గుర్తు చేస్తున్నారు. కానీ, నేడు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, దేశంలోనే మొదటిసారిగా అత్యధిక పరిహారం ఇస్తున్నారని సంతోషపడుతున్నారు. ఇది సీఎం కేసీఆర్‌కు సాగురంగంపై ఉన్న మమకారానికి నిదర్శనమని కర్షకులు చెబుతున్నారు.
– కరీంనగర్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మునుపు ఇట్ల భరోసా ఇచ్చినోళ్లు లేరు
నాది గోపాల్రావుపేట. గుండి గ్రామంల 13 ఎకరాలు ఉన్నది. ఇరవై మూడేండ్ల కింద మామిడి చెట్లు పెట్టిన. కాపు మొదలై 20 ఏండ్ల నుంచి పంట చేతికస్తంది. ఈ యేడు కాత తక్కువనే వచ్చింది. ‘పుండుమీద కారంజల్లినట్టు’ పోయిన నెలల పడ్డ రాళ్లవానకు కాయలన్నీ రాలినయ్. తోటంతా అక్కెరకు రాకుంటైంది. లక్షల రూపాయల నష్టం వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ సార్, నా తోటకు వచ్చి చూసిండు. ‘నేనున్నానని’ ధైర్యం చెప్పిండు. ఎకరాకు పది వేలిత్తమని అన్నడు. ఆ సారు చెప్పిండంటే చేత్తడని నేను ఆ రోజే అనుకున్న. నెల తిరగకముందే పైసలు విడుదల చేసిండు. రేపో మాపో ఖాతాల పడ్తయట. సంతోషంగా ఉన్నది. కానీ, తెలంగాణ రాకముందు ఇట్ల భరోసా ఇచ్చినోళ్లు లేరు. పదేండ్ల కింద గిట్లనే వడగళ్ల వాన పడి కాయలు రాలితే, ఎవలెవలో వచ్చి చూసిపోయిన్రు. కానీ, ఈసమెత్తు సాయం చేయలె. అప్పుడు ఐదెకరాల లోపున్నల్లోకే ఎకరాకు మూడువేలో ఎంతో ఇచ్చి చేతులు దులుపుకున్నరు. పెద్ద రైతులకు రూపాయి ఇయ్యలేదు. సీఎం కేసీఆర్ అట్ల కాదు, రైతులకు అన్నింటా అండగా నిలుస్తున్నడు. అనేక పథకాలు తెచ్చిండు. పంట పెట్టుబడి ఇత్తున్నడు. సాగునీళ్ల గోస లేకుండా చేసిండు. ఫ్రీ కరెంట్ ఇత్తండు. పంట పండినంక కొంటండు. మొన్న పంట నష్టపోయిన రైతుల దగ్గరికచ్చి కొండంత భరోసా ఇచ్చిండు. మాకు ఇంతకంటే ఏం కావాలె.
– ఎడవెల్లి రాజిరెడ్డి, రైతు (రామడుగు)
దేశంలో ఎక్కడా లేని పరిహారం
కేంద్ర నిబంధనల ప్రకారం చూస్తే ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న మక్క ఎకరానికి 3,350, వరికి 5,400, మామిడికి 7,200 నష్ట పరిహారం చెల్లించాలి. కానీ, తెలంగాణలో వ్యవసాయం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోవద్దని, రైతు సోదరుల ఆత్మైస్థెర్యం దెబ్బతినద్దని ఆలోచించి దేశ చరిత్రలోనే మొదటిసారి ఎకరానికి 10 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించినం. ఈ సాయం ఏ ఆరు నెల్లకో యాడాదికో కాకుండా తక్షణమే అందించాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చిన. త్వరలోనే నష్ట పరిహారం చెల్లిస్తం. – గత నెల23న రామడుగు మండలం రామచంద్రాపూర్ వేదికగా రైతులకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, నెలతిరక్కుండానే పంట నష్టపరిహారం విడుదల చేశారు. రెండు రోజుల క్రితమే ఉత్తర్వుల జారీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ రాముడుగు : గత నెల 17 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు పడిన సంగతి తెలిసిందే. ప్రకృతి బీభత్సంతో వేలాది మంది రైతుల పంటలు దెబ్బతిన్న విషయం విధితమే. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళనలో పడ్డారు. ఆరుగాలం శ్రమ అకాల వర్షాల పాలైందంటూ బాధపడ్డారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆరే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. గత నెల 23న కరీంనగర్ జిల్లాతోపాటు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో నష్టపోయిన పంటలను స్వయంగా పరిశీలించారు. ఆ సమయంలో తాను జ్వరంతో బాధపడుతున్నా లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో కలియ దిరిగారు. అనేక మంది రైతులతో మాట్లాడారు. పోయిన పంటను తిరిగి తెచ్చి ఇవ్వలేము గానీ, మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. అప్పుడు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్, గుండి గ్రామాల్లో స్వయంగా పరిశీలించి, రామడుగు శివారు రైతు వేదికలో మాట్లాడారు. అన్నదాతలను ఆదుకునేందుకు అన్నిచర్యలూ తీసుకుంటామని, తక్షణమే బృందాలను పంపించి అంచనా వేసి పరిహారం చెల్లిస్తామని చెప్పారు. అంతేకాదు, పరిహారం ఎకరాకు 10 వేలకు పెంచి ఇస్తామని అదేరోజు ప్రకటించారు.
ఆదుకుంటున్న రాష్ట్రం
కేంద్ర నిబంధనల ప్రకారం చూస్తే అకాల వానలతో పంటలు దెబ్బతింటే.. వరికి ఎకరాకు 5,400, మక్కకు 3,332, మామిడికి 7,200 చొప్పున పరిహారం ఇస్తున్నది. అది కూడా ఎన్ని నెలలు సంవత్సరాలు పడుతుందో తెలియదు. అనేకసార్లు కేంద్ర బృందాలు సర్వే చేసి వెళ్లిన తర్వాత కూడా నిర్ధారిత పరిహారం రైతులకు అందని దాఖలాలు లెక్కకు మించి ఉన్నాయి. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఎకరాకు 10 వేల పరిహారం చెల్లిస్తామని చెప్పడమేకాదు, ఏ కేంద్ర బృందాలతో సంబంధం లేకుండానే నిధులు మంజూరు చేశారు. క్షేత్రస్థాయి పర్యటన చేసిన కేవలం 28 రోజులకే.. పరిహారం ఉత్తర్వులు వెలువడడం, మరో నాలుగైదు రోజుల్లో బాధిత రైతు ఖాతాల్లో డబ్బులు జమ కానుండడంపై కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడే ఆదుకుంటే రైతుకు ధైర్యంగా ఉంటుందని, అదే పని ఇప్పుడు కేసీఆర్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
15,833 మంది రైతులకు ప్రయోజనం
గత నెలలో పడిన వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు పకడ్బందీ సర్వే నిర్వహించారు. పంట నష్టపోయిన ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగొద్దని సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్లు, ప్రత్యేక దృష్టి సారించి సర్వే చేయించారు. అధికారుల నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఆ ప్రకారం చూస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,988 మంది రైతులు నష్టపోయినట్టు తేల్చి, ఎకరానికి 10 వేల చొప్పున 151 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. ఈ మేరకు బుధవారమే ఉత్తర్వులు జారీ చేశారు. విడుదలైన పరిహారాన్ని 90 రోజుల్లోగా ప్రతి రైతు ఖాతాలో జమ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 15,883 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుండగా, రైతులు, రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘నేనున్నా’ అంటూ ధైర్యం చెప్పడమే కాకుండా.. దేశంలో ఎక్కడా లేని విధంగా 10వేల పరిహారం ఇచ్చి తమకు అండగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మాకు సర్కారోళ్లు అందించే సాయమే గొప్ప
నేను పేదింట్ల పుట్టిన గీత కార్మికుడిని. పదేండ్ల కింది వరకు మాకు కరువుండేది. పోయిన సర్కారోళ్లు ఏ సాయం జేసెటోళ్లుగాదు. తెలంగాణ రాకముందు బతుకుదెరువు లేక పొట్టచేతపట్టుకొని అప్పుచేసి గల్ఫ్‌కు పోయిన. అక్కడ బండెడు కట్టంజేసి ఎంతోకొంత కూడవెట్టి సొంతూరిల ఇంత ఎవుసం భూమి కొనుకున్న. తెలంగాణ వచ్చినంక గల్ఫ్‌ను ఇడిసిపెట్టిన. ఇక్కడికి వచ్చి ఎవుసం జేసుకుంటున్న. ఉన్న నాలుగెకరాల్లో వరి సాగు జేసిన. పదేండ్లకింద మా ఊళ్లె రెండు తాడిచెట్ల లోతుల గుడ నీళ్లుండేటియి కాదు. ఇప్పుడు గజంలోపలనే మస్తు నీళ్లన్నయ్. ఇగ బాధలేదని మా మండలంల అందరూ వరే ఏసిన్రు. ఇంకో పదిహేను రోజులైతే ఈనుతదనంగా పెద్ద రాళ్లవాన పడ్డది. పంటంత ఖరాబైంది. ఎట్లరా దేవుడా..? అనుకున్న. తెలంగాణ రాకముందు గిట్లనే పంటకేమన్న అయితే చూసెటోళ్లు దిక్కులేకుండె. ఒకవేళ రైతులు తిడ్తరని సార్లు మానానికచ్చి ఏదో రాసుకొని పొయ్యెటోళ్లు. అప్పుడు నాకు పొలం లేకున్నా ఇసోంటివి మస్తు జూసిన. ఆ పైసలు అచ్చేది లేదు సచ్చేది లేకుండె. ఇస్తే గిస్తే గాళ్ల పార్టీ వాళ్లకే ఎంతో కొంత ఇత్తుండె. అవన్నీ గుర్తొచ్చి మస్తు బాధపడ్డ. కానీ, వడగండ్ల వానలతోని పంటలు దెబ్బతిన్నయని తెలుసుకొని కేసీఆర్ సార్లు మా ఊరికచ్చిండు. మా పంటలను చూసిండు. దిగులువడకు శంకరయ్య అన్నడు. ఎకురానికి పదివేలిత్త అని చెప్పి ధైర్నమిచ్చిండు. నెల దిరుగకముందే పైసలు విడుదల చేసిండు. రేపోమాపో మా ఖాతాలో పడుతయట. మాకు కేసార్ సారుపై పూర్తి నమ్మకం ఉన్నది. ఎకరాకు రెండు, మూడు వేలత్తయని అనుకున్నకాడ పదివేలిత్తమని భుజం మీద చెయ్యేసి చెప్పిన కేసీఆర్ సార్‌కు దండాలు వెడ్తున్న. రెండ్రోజులకింద వరి కోసినం. ఎకురానికి మూడు ట్రాక్టర్ డబ్బాలు వచ్చేకాడ ఒక్కటిగుడ నిండలె. కానీ, సీఎం సారు అందించిన భరోసానే కొండంత అండ. మాకు సర్కారోళ్లు అందించే సాయమే గొప్ప.
– బండారి శంకర్‌గౌడ్, గుండి (రామడుగు)
పట్టని కేంద్రం
కేంద్రం ఆది నుంచీ రైతులపై చిన్నచూపే చూస్తున్నది. పరిహారం చెల్లింపులోనూ ముప్పుతిప్పలు పెడుతున్నది. అకాల వానలతో పంటలు దెబ్బతిన్న విషయం గురించి కేంద్రానికి సమాచారమిస్తే.. మూడు నాలుగు నెలల తర్వాత బృందాలను పంపించి సర్వే చేసి, చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోతే అధిక పరిహారం ఇవ్వాలని చాలా కాలంగా రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతూ వస్తున్నారు. ఈ విషయంలో ఎన్నో విజ్ఞప్తులు చేశారు. అయినా, కేంద్రం పెడచెవిన పెడుతూనే ఉన్నది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, నష్టపోయిన పంటలకు ప్రతి ఎకరాకు 10వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. దేశ చరిత్రలోనే ఈ తరహా పరిహారం ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేదు. అందులోనూ కేంద్రం సహాయం లేకుండానే నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే తన ఖాతాల నుంచి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులను జారీచేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది.
రైతుల కోసం బతికే కేసీఆర్ మంచిగుండాలే
మాది సాధారణ రైతు కుటుంబం. తాతలనుంచి వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నం. మా తండ్రి నుంచి నాకు ఎనిమిది ఎకరాలు వారసత్వంగా వచ్చింది. 2014కు ముందు అందరిలాగానే వరి సాగు చేస్తుండె. అప్పుడు సాగునీరు లేక ఇబ్బందులు పడ్డం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చినయ్. కాళేశ్వరం జలాలు వచ్చినప్పటి నుంచి మంచిరోజులు మొదలైనయ్. పుష్కలంగ నీళ్లుండడంతో అందరికీ భిన్నంగా పంటలు సాగుచేయాలని అనుకున్న. పట్టుదలతోని కొత్త పంటలను సాగుచేసిన. రాత్రి పగలు కష్టపడి ఎనిమిది ఎకరాలను ముప్పై ఎకరాలకు తెచ్చిన. చాలామంది సలహాలు తీసుకొని పది ఎకరాల్లో తీపిదోస (మస్క్‌మిలన్), ఇంకో పదెకరాల్లో వరి, నాలుగెకరాల్లో పుచ్చకాయ. రెండెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, రెండెకరాల్లో ఆపిల్, ఒక ఎకరంలో లిచ్చి వేసిన. కానీ, గత నెలలో వడగండ్ల వానకు అన్ని పంటలు దెబ్బతిన్నయ్. లక్షల రూపాయల నష్టం వచ్చింది. దెబ్బతిన్న పంటలను చూసేందుకు వినోద్ కుమార్ సారొచ్చిండు. పాడైన పంటను చూసి చాలా బాధపడ్డడు. రెండ్రోజుల తర్వాత సీఎం కేసీఆర్ సారొచ్చిండు. అన్ని అడిగి తెల్సుకొని ‘నేనున్నా బిడ్డా, భయపడకు’ అని ధైర్నం చెప్పిండు. అన్నదాతలను కడుపులవెట్టుకొని కాపాడుకుంటమని, దెబ్బతిన్న పంటలకు ఎకరాన పదివేలు ఇస్తమని భరోసా ఇచ్చిండు. నెలరోజులు గడువకముందే పంట నష్టపరిహారం విడుదల చేసిన్రని పేపర్ల చూసిన. మాకు ఇయ్యాల్లనో, రేపో వస్తయాట. బ్యాంకు ఖాతాలనే జమ చేస్తరట. సంతోషంగా ఉన్నది. పాడైన నాపంటను చూసేందుకు వచ్చి, మా బాధలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ సారు గురించి ఎంత చెప్పినా తక్కువే. రైతుల కోసం బతికే సీఎం కేసీఆర్ మంచిగుండాలే.
– ద్యావ రాంచంద్రారెడ్డి, రైతు,లక్ష్మీపూర్ (రామడుగు)