కలెక్టరేట్, జనవరి 13 : చెప్పేటివి శ్రీరంగ నీతులు చేసేటివి అసంబద్ధ పనులు అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామంటూనే, మైనార్టీల పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నది. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ, వారికి తీరని అన్యాయం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందించే ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు ఎత్తేయగా, తాజాగా ఉన్నత విద్యనభ్యసిస్తున్న మైనార్టీలకు మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటించింది. నెట్ పరీక్షతో పాటు విశ్వవిద్యాలయాలు నిర్వహించే పరీక్షల ద్వారా ఎంపికై ఎంఫిల్, పీహెచ్‌డీలు చేసే వి ద్యార్థులకు అందించే యూనివర్సిటీ ఫెలోషిప్‌లు కూడా ఉపసంహరించుకున్నది.
కేవలం ప్రభుత్వ ఉపకార వేతనాలపై ఆధారపడి చదువుకుంటున్న మైనార్టీ విద్యార్థులు జిల్లాలో వేలల్లో ఉన్నారు. ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం 2021-22 విద్యా సంవత్సరంలో జిల్లాలో సుమారు 4వేల వరకు దరఖాస్తులు రాగా, 22-23లో 4వేలకు పైగా వ చ్చినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, పలు విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్, పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులు వందల్లో ఉన్నట్లు అంచనా. రెండేళ్లుగా వీరికి ఉపకార వేతనాలు అందించకుండా కేంద్రం మొండి చేయి చూపుతున్నది. ఒక్కసారిగా స్కాలర్‌షిప్‌ల ను రద్దు చేయడంతో వారంతా త మ చదువులకు స్వస్తి పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయని, మైనార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ముస్లింలతో పాటు సిక్కులు, పా ర్శీలు, బౌద్ధ, జైన మతాలైన అల్పసంఖ్యాక వర్గా ల పట్ల కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ, జిల్లా కేంద్రంలో వారంతా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి, దశలవారీగా నిరసనలు చేపట్టేందుకు కార్యచరణ కూడా రూపొందించినట్లు తెలుస్తున్నది. ఈనెలాఖరు నుంచి అధికారులకు వినతిపత్రాలు అందించడం, నిరసన ప్రదర్శనలు చేపట్టడం, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేయనున్నట్లు మై నార్టీ వర్గాల జేఏసీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.