కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆరా..
అసంక్రమిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన
area hospital korutla | కోరుట్ల, మార్చి 27: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు డాక్టర్ రమణ, డాక్టర్ శ్రీనివాస్ గురువారం కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సునీత, వైద్య సిబ్బందితో ప్రతినిధులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈమేరకు ఆసుపత్రిలో ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు, ఆరోగ్య సిబ్బంది నియామకం, నిధుల వినియోగంపై చర్చించారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలు జరుగుతున్నాయో పరిశీలించారు. ఏరియా హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు పొందిన వ్యక్తులను కలిసి ఆరోగ్య వివరాలను సేకరించారు. ఆరోగ్య కేంద్రాల్లో మౌళిక వసతులు, ల్యాబ్ సేవలు, గర్భిణీలు, ప్రసవం తర్వాత తల్లులకు అందించే సేవలు, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు, యుక్త వయస్సువారి ఆరోగ్యం, ఫ్యూబార్టీ సమయంలో వచ్చే మార్పులు, వారికి కౌన్సిలింగ్ చేయడం, ఆసంక్రమిత వ్యాధులు, సంక్రమిక వ్యాధులకు అందించే సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
మందుల నిలువలు, నిధుల వినియోగంపై సమాచారం సేకరించారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు, ఆరోగ్య సేవలపై ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు ఆసుపత్రిలోని ఐసీటీసీ సెంటర్, టీబీ యూనిట్లను ప్రతినిదులు పరిశీలించారు. ఆన్ హ్యండ్ క్షయ వ్యాధిగ్రస్తుల కేసుల వివరాలు, చికిత్స అందించే కార్డుల నమోదును సరిచూశారు. నిక్షయ పోషణ యోజన కింద క్షయ వ్యాదిగ్రస్తులకు డబ్బులు అందుతున్నాయా లేదా అని వివరాలు అడిగారు. ప్రతి నెలా ప్రిజంటివ్ టెస్టింగ్ ఎక్కువగా జరిగేలా చూడాలని, తద్వారా ఏ ఒక్క టీబీ కేసు తప్పిపోకుండా చికిత్స అందించవచ్చని సలహలు, సూచనలు చేశారు. ఈసమావేశం ప్రభుత్వ వైద్యులు వినోద్ కుమార్, లక్మీ, రమేష్, జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రోగ్రాం అధికారి తులసి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.