ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఆదివారం అంబరాన్నంటాయి. విద్యుద్దీప కాంతుల్లో ముస్తాబైన చర్చిలకు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పలువురు గీతాలాపన చేశారు. పాస్టర్లు ఏసుక్రీస్తు శాంతి సందేశాన్ని వినిపించారు.
– నమస్తే నెట్ వర్క్
నమస్తే నెట్ వర్క్, డిసెంబర్ 25: కరీంనగర్ మానేరు డ్యాం సమీపంలోని బ్లెసింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చిలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి గంగుల, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ వై సునీల్‌రావు హాజరయ్యారు. ఎస్పీ బంగ్లా సమీపంలోని సీఎస్ఐ వెస్లీ కేథడ్రల్ చర్చికి వెళ్లారు. ప్రపంచ శాంతి కోసం జన్మించిన దేవుడు ఏసు అని, విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కుల మతాలకతీతంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు.
కేసీఆర్ సర్కారు అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా సీఎస్ఐ(వెస్ట్ ) క్యాథిడ్రల్ చర్చిలో మంత్రి గంగుల సందేశం వినిపించిన తర్వాత తనకు ఇష్టమైన పాట ‘రాజులకు రాజుపుట్టే ఏసయ్య.. మనమెళ్లుదాం చూడ ఏసయ్య..’ అంటూ పాడి సందడి చేశారు. రామడుగు మండలం వెలిచాల శివారులోని ప్రశాంత్ భవన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య పాల్గొని అనాథ చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.
హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక మండలాల్లో జరిగిన కార్యక్రమాలకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాలలోని మిషన్ కౌంపౌండ్ సీఎస్ఎఐ చర్చి, థరూర్ క్యాంపు క్రిస్ట్ చర్చ్, గోవింద్ పల్లి ఏసురక్తం చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. మల్యాల శ్రీసాయి ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.
క్రైస్తవులు, పాస్టర్, స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని హేర్మన్ గోస్పెల్ చర్చి, బీవైనగర్‌లో బేతేస్య బాప్టిస్ట్ చర్చిల ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో జడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లు న్యాలకొండ అరుణ. జిందం కళ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలోని పలు చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే చందర్ ముఖ్యతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయాచోట్ల కేక్‌లు కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.