MLA Vijayaramana Rao | పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 26: ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటలకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ లో గల శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులు, సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ రైతులు దళారీల చేతుల్లో మోసపోకుండా ఉండేవిదంగా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. 8శాతం తేమతో రూ.8110 లకు పత్తి పంటకు ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఎప్పుడు రైతుల మేలు కోరుతుం దన్నారు. పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్నలు, పొద్దు తిరుగుడు రైతులు ఏ పంట పెట్టిన ఆ పంటకు ప్రభుత్వం మద్దతు ఇచ్చి రైతులను పంట నష్టపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. ఇప్పటికే ఎన్నో పథకాలతో ముందుకు పోతుందన్నారు.
త్వరలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించి గింజ కటింగ్ లేకుండా వారి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎలాంటి తరుగు లేకుండా రైతులకు మేలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్లు స్వరూప సురేందర్ , మినుపాల ప్రకాష్ రావు , శ్రీరామ జిన్నింగ్ ఇండస్ట్రీస్ యాజమాన్యం, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.