Singareni | గోదావరిఖని : సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై యజమాన్యం చెబుతున్న తప్పుడు లెక్కల పైన సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి డిమాండ్ చేశారు. రామగుండం రీజియన్ లోని పలు బొగ్గు గనుల పైన ఉన్న బొగ్గు నిల్వలను టీబీజీకేఎస్ బృందం గురువారం పరిశీలించింది. యాజమాన్యం ప్రకటించిన విధంగా బొగ్గు నిల్వలు లేవని, కోల్ డంపింగ్ యార్డ్ ఖాళీగా కనబడుతున్నాయని వెల్లడించారు. రామగుండం ఓసీపీ 5వ గనిలో అత్యధికంగా బొగ్గు విలువలు ఉన్నాయని యాజమాన్యం పేర్కొన్నదని తెలిపారు. కానీ వాటిని సందర్శించడానికి మాత్రం అనుమతించలేదని, సుమారు మూడున్నర లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారని, వాస్తవంగా బొగ్గు నిల్వలు 40 వేల టన్నులకు మించి లేవని పేర్కొన్నారు.
బొగ్గు నిల్వచేసే ప్రాంతాలలో షేల్ బొగ్గు, బండలు, కాలిపోయిన బొగ్గు బూడిద మాత్రమే దర్శనమిస్తున్నాయని అన్నారు. రామగుండం బొగ్గు నిల్వలు లేవని తమ పరిశీలనలోనూ అందిన సమాచారం ప్రకారం తెలుస్తుందని వెల్లడించారు. బొగ్గు నిలువల తనిఖీ కోసం టీబీజీకేఎస్ బృందాన్ని అనుమతించకపోవడం అంటేనే బొగ్గు నిలువలు లేవని అంగీకరించడమేనని పేర్కొన్నారు. రామగుండం డివిజన్ వన్ లో బొగ్గు నిలువలు పేరుకుపోయినట్లయితే బొగ్గు రవాణా ఎందుకు తగ్గుతున్నదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రామగుండం డివిజన్ వన్ బొగ్గు ఉత్పత్తిలో సింహభాగం ఓసీపీ 5వ గనిదే, అలాంటప్పుడు బొగ్గు రవాణా ఎందుకు జరగటం లేదని, ఇది అనేక అనుమానాలకు కారణమని కూడా వెల్లడించారు. ఆయన వెంట టీబీజీకేఎస్ కేంద్ర నాయకులు పోలాడి శ్రీనివాసరావు, ఆర్ జీవన్ ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్ తదితరులు ఉన్నారు.