Vaman Rao couple’s murder case | రామగిరి, సెప్టెంబర్ 18 : తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన న్యాయవాద దంపతులు గట్టు నాగమణి – వామన్ రావుల హత్య కేసుపై సీబీఐ అధికారుల విచారణ అధికారికంగా గురువారం ప్రారంభమైంది. కేసు దర్యాప్తు మొదటి దశలో భాగంగా మంథని – పెద్దపల్లి ప్రధాన రహదారి లో రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని మారుతి నగర్ వద్ద జరిగిన సంఘటన స్థలాన్ని సీబీఐ బృందం పరిశీలించింది. సీబీఐ అధికారులు హత్యకు గురైన వామన్ రావు తండ్రి కిషన్ రావును వెంట తీసుకువెళ్లి అక్కడ పరిస్థితులను సమీక్షించారు.
సంఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించి, అప్పటి పరిస్థితులు, సాక్ష్యాధారాల గురించి కిషన్ రావుతో చర్చించారు. హత్య సమయంలో వాహనం నిలిపిన ప్రదేశం, దాడి చోటుచేసుకున్న మార్గం, ఆ ప్రదేశం క్షుణ్ణంగా పరిశీలించారు. హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు సీబీఐ ప్రత్యేక బృందం ఏర్పాటైందని, అవసరమైతే నిందితులను తిరిగి విచారణ చేస్తారని సమాచారం.
వామన్ రావు దంపతుల హత్య 2021 ఫిబ్రవరి 17న, పగటిపూటే మంథని – పెద్దపల్లి రహదారిపై వామన్ రావు, నాగమణి దంపతులు కారులోప్రయాణిస్తున్నారు. కాగా కొందరు వ్యక్తులు దారిలో అడ్డగించి దారుణంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మొదట స్థానిక పోలీసులు విచారణ చేపట్టగా, కేసు సంక్లిష్టత దృష్ట్యా న్యాయస్థానం ఆదేశాల మేరకు తరువాత సీబీఐకి బదిలీ చేశారు. రామగిరి ప్రాంతంలో సీబీఐ పరిశీలన జరగడంతో కేసు వేగంగా ముందుకు సాగుతుందనే ఆశాభావం బాధిత కుటుంబంతో పాటు ప్రజల్లో నెలకొంది.