సిరిసిల్ల పట్టణం అస్తవ్యస్తంగా మారింది. బల్దియా అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో అధ్వానంగా తయారైంది. ఓ వైపు పారిశుధ్య లోపంతో సతమతమవుతున్న జిల్లా కేంద్రంలో కొద్దిరోజులుగా రోడ్లపై తిరుగుతున్న పశువుల మందలతో తరచూ ట్రాఫిక్ జాం జరుగుతున్నది. అడ్డువస్తున్న ఆవులు, బర్లతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతూ, ప్రమాదాలూ జరుగుతుండగా, ఇప్పటికైనా యంత్రాంగం మేలుకోవాల్సి ఉన్నది.
సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పశువుల సంచారం ఎక్కువైంది. మందలు మందలుగా తిరుగు తుండడంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతున్నది. ఇప్పటికే బల్దియా అధికారుల నిర్లక్ష్య వైఖరితో స్మార్ట్ సిటీ క్రమంగా డ్రైన్ సిటీగా మారుతుండగా, మరోవైపు పెరుగుతున్న వాహనాలకుతోడు రోడ్లపై తిరుగుతున్న పశువుల కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతున్నది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా నేతన్న చౌరస్తా, కొత్త బస్డాండ్ వంటి ప్రధాన చౌరస్తాల వద్ద పశువులు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. రాత్రి వేళలో రోడ్లపైనే నిలిచి ఉంటున్నాయి. చీకట్లో పలువురు ప్రయాణికులు గమనించకుండా వాటిని ఢీకొట్టి గాయాలపాలైన సందర్భాలు ఉన్నాయి.
గాంధీనగర్లోని కూరగాయల మార్కెట్లో, అటు ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో సంచరిస్తుండడంతో రైతులు, విక్రయదారులు, కొనుగోలుదారులు, వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. సమస్యకు పరిష్కా రం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గోవులు, గేదెల యజమానులు వాటిని తమ సొంత స్థలాలలో నిలుపుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. అయితే పశువులను మూడు రోజుల వ్యవధిలో సొంత స్థలాలకు తరలించుకోవాలని, లేదం టే వేములవాడలోని రాజన్న ఆలయ గోశాలకు తరలిస్తామని బల్దియా అధికారులు గత నెలలో ప్రకటన విడుదల చేసినా స్పందన కరువైంది. సమస్య ఎప్పటి లాగే ఉండిపోయింది. అధికారులు కంటితుడుపు చర్యగా ప్రకటన విడుదల చేసి సమస్యను గాలికి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
మున్సిపల్ పరిధిలో రోడ్లపై తిరుగుతున్న గోవుల నియంత్రణ కోసం నెలలో రెండు రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. గోవులను దశల వారీగా వేములవాడలోని గోశాలకు తరలిస్తున్నాం. గోవులను యజమానులు వారి వారి సొంత స్థలాలకు తరలించుకోవాలని ప్రకటన చేసినం. ఇప్పటికైనా తరలించుకోవాలి. లేదంటే అన్ని గోవులను గోశాలకు తరలిస్తాం.