రేవంత్ సర్కారు విడుదల చేసిన కులగణన సర్వే వివరాలపై కుల సంఘాల నాయకులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇది పెద్ద తప్పుల తడకగా అభివర్ణిస్తున్నారు. కులాల వారీగా గణన జరిగినప్పుడు ఉప కులాల ఊసే లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కుల గణనలో పారదర్శకత ఉంటే వెంటనే గ్రామాల వారీగా ఏ కులాలు ఎంత శాతం ఉన్నాయో.. ఆయా కులాల వారీగా జాబితాలను విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ తమ ప్రాబల్యం కోసమే ఈ సర్వే చేసిందని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చేస్తున్నారు. కుల గణన సమయంలోనే ఈ సర్వే శాస్త్రీయంగా లేదని చెప్పామని, ఇప్పుడు తాము ఊహించిందే నిజమైందని స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పలకు పోయి నిర్వహించిన కుల గణన సర్వే తప్పుల తడకేనని తేలిపోయింది. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన ఈ నివేదికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. అందులో ఏ ఒక్క కులానికి సంబంధించిన వివరాలు కూడా సరిగ్గా లేవని తెలుస్తుండగా, బడుగుబలహీన వర్గాలు భగ్గుమంటున్నాయి.
బీసీ అణగదొక్కేందుకే కుట్ర చేశాయని మండిపడుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంలో 2024 నవంబర్‌లో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే వాస్తవికతకు దూరంగా ఉన్నదని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. బీసీ జనాభా విషయంలో పూర్తి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. ముస్లిం బీసీలను మినహాయిస్తే 51 శాతానికిపైగా ఉండాల్సిన బీసీలను 46.25 శాతం చూపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
బీసీ ముస్లింలు 10.08 శాతం చూపారని, ఈ రెండూ కలిపితే 56.33 శాతం మాత్రమే వస్తుందని అంటున్నారు. నిజానికి గతంలో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారంగానే 51 శాతానికి మించి ముస్లింలు కాకుండా కేవలం బీసీ కులాల జనాభానే ఉండేదని, ముస్లింల జనాభాతోపాటు బీసీల జనాభా కూడా ఎంతో కొంత పెరుగుతుందే తప్పా తగ్గుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇటు ఎస్సీ జనాభాను ముఖ్యంగా మాలల జనాభాను కూడా తగ్గించి చూపారని ఆ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. 20 శాతానికిపైగా ఉన్న ఎస్సీలను కేవలం 17.43 శాతం ఉన్నట్టు చూపుతున్నారని దళిత సంఘాల నాయకులు వాపోతున్నారు. ఇలాంటి తప్పుడు తడకల నివేదికలను విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయా సంఘాల నాయకులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు.
కుల గణన పేరుతో చేపట్టిన సర్వేలో కేవలం ప్రధాన కులాల జనాభాను మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం.. వాటి ఉప కులాల ఊసెత్తక పోవడంతో అందులో ఏదో మతలబు ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ వర్గాల్లోని ప్రధాన కులాల జనాభాను మాత్రమే చూపారని, అందులోనూ తక్కువ చేసి చూపారని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రతి చోటా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న యాదవ, కర్మ, పద్మ శాలీ, గౌడ తదితర కులాలల్లోని ఉప కులాల ప్రస్తావనకు రాకపోవడంతో ఈ సర్వే శాస్త్రీయతను కోల్పోయిందనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని కులాలకు సంబంధించిన ఉప కులాలను పేర్కొనడం, మరి కొన్ని కులాల ఉప కులాల ఊసే లేక పోవడం అందుకు నిదర్శనంగా పలు సంఘాల నాయకులు చూపుతున్నారు. ఎస్సీ వర్గాల్లో అత్యధికంగా ఉన్న మాదిగ, మాల కులాలకు సంబంధించిన వివరాలను వెల్లడించినా.. మిగతా 57 కులాల ప్రస్తావన మర్చిపోయిందని, అలాంటపుడు ఇది కుల గణన ఏ విధంగా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో వాస్తవం ఉంటే రాష్ట్ర, జిల్లా స్థాయిలో కాకుండా గ్రామాల వారీగా జాబితాను విడుదల చేయాలని ఆయా కుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల వారీగా ఇంటింటికీ వెళ్లి సర్వే చేసినపుడు అదే గ్రామాల వారీగా జాబితాను విడుదల చేయడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. కులాల సర్వే నిర్వహించినప్పుడే అందులో శాస్త్రీయత లేదని, అనేక సంఘాల నాయకులు డెడికేటెడ్ కమిటీకి విన్నవించారు. అయినా పెడచెవిన పెట్టి ఏకపక్షంగా ప్రభుత్వం సర్వే నిర్వహించిందని, ఇప్పుడు వెల్లడించిన తప్పుడు నివేదికలు అపుడే చెప్పిన తమ అభ్యంతరాలకు అద్దం పడుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.
పద్మశాలీ బిడ్డలపై రాష్ట్ర సర్కారు కుట్ర పన్నినట్టు అనిపిస్తున్నది. లేకపోతే పద్మశాలీల సంఖ్యను ఇంత తక్కువగా చూపుతరా..? కేవలం పదకొండు, పన్నెండు లక్షలకు పరిమితం చేస్తూ జనాభా లెక్కలను ప్రకటిస్తారా..? ఇది అత్యంత బాధాకరం. రాష్ట్రంలో 60 శాతానికిపైగా బీసీల జనాభా ఉంటుందన్న నమ్మకంలో మేముంటే కేవలం 46 శాతం మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పడం సరిగా అనిపించడం లేదు. ఇక బీసీ కులాల్లో అత్యంత కీలకమైన పద్మశాలీ కుల జనాభా కేవలం 11,79,031గా ప్రకటించారు. ఇదిపూర్తిగా సత్యదూరమైన సంఖ్య. నేను గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పద్మశాలీ కుల సంఘ నాయకుడిగా పనిచేశాను. ఆ సమయంలోనే ఒక్క ఉమ్మడి జిల్లా పరిధిలోనే మూడున్నర లక్షల మంది పద్మశాలీలు ఉన్నట్టుగా మేం లెక్కలు తీశాం. ఒక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే 3.5 లక్షల పద్మశాలీ జనాభా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పద్మశాలీ రాష్ట్ర సంఘం అంచనాల ప్రకారం మా జనాభా 40 లక్షల వరకు ఉంటుంది. ప్రభుత్వం మా అంచనాల్లో కనీసం ఇరవై శాతం జనాభాను సైతం ప్రకటించలేదు. ఇది ఏ మాత్రం సరికాదు. ఈ లెక్కలపై అనేక అనుమానాలు ఉన్నాయి. పద్మశాలీ జనాభా లెక్కలపై పద్మశాలీ రాష్ట్ర సంఘం అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. దీనిపై పోరాటం చేయడానికి రాష్ట్ర సంఘం, జిల్లా కార్యవర్గాలతో చర్చలు జరుపుతున్నది.
– రుద్ర శ్రీనివాస్, పద్మశాలీ కుల సంఘం జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు
బీసీల కుల గణన పేరుతో 2024లో చేపట్టిన సర్వేను మేం ఒప్పుకోవడం లేదు. మా దృష్టిలో ఇది సర్వేనే కాదు. బీసీల ముసుగులో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతోనే ఈ సర్వే చేశారని నేను బలంగా నమ్ముతున్న. గతంలో నిర్వహించిన కుల గణనలో వెల్లడైన బీసీ జనాభా కంటే ఇప్పటి జనాభా తక్కువ ఎలా అవుతుంది? రాష్ట్రంలో బీసీలు 51 శాతానికిపైగా ఉంటరు. కానీ, 46 శాతమే చూపిస్తున్నరు. అదే ముస్లిం జనాభాను 10 శాతానికి ఒకింత ఎక్కువే చూపిన్రు. ఇది ఎంత వరకు కరెక్ట్? ముస్లింలు, బీసీలను కలుపుకొంటే ఇంకా ఎక్కువ శాతం జనాభా రావాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే వాస్తవాలు దాచి తప్పుడు లెక్కలు చూపింది. బీసీలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ముందు బీసీలు కొట్టే దెబ్బకు తట్టుకునేందుకు సిద్ధం కావాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఇచ్చిన మాట మర్చిపోయింది. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఏటా రూ.20 వేల కోట్లు బీసీల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చెప్పింది. ఈ రెండు ప్రధాన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదు.
– రంగు సంపత్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో ఉప కులాల ప్రస్తావన ఎందుకు తేలేదు. కులాల వారీగా సర్వే చేసినప్పుడు యధాతదంగా నివేదికలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎస్సీ కులాల్లో మాల, మాదిగ ఉప కులాల ప్రస్తావనే లేదు. రాజకీయ అవసరాల కోసం, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా గుడ్డిగా నివేదికలు రూపొందించి జనంలోకి వదిలారు. నిజానికి మాల మాదిగల జనాభా ఉప కులాలను కలుపుకొని చూస్తే దగ్గర దగ్గరగా ఉంటుంది. కానీ, మాల, మాదిగ జనాభా విషయంలో చాలా అంతరం చూపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కుల గణనలో ఈ విషయం వెల్లడయితే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దెదిగి పోవాలి. రాజకీయంగా పబ్బం గడుపుకొనేందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఎస్సీ జనాభా 20 శాతనికి మించి ఉంటుంది. కానీ, ఈ నివేదికల్లో మాత్రం 17 శాతం మాత్రమే చూపి ఈ వర్గాలకు తీరని అన్యాయం చేశారు. చెత్త బుట్టలో పడేసేందుకు కూడా ఈ నివేదిక పని చేయదు.
– మేడి మహేశ్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మున్నూరుకాపుల సంఖ్య పదమూడున్నర లక్షలా..? రెడ్డీల సంఖ్య పదిహేడున్నర లక్షలా..? ఇదేం లెక్క? ఇదేం కథ? ఇంతకంటే అన్యాయం ఉంటుందా..? రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనాభా 46 శాతం మాత్రమే ఉంటుందంటే నమ్మకం కలగడం లేదు. బీసీల్లో అత్యంత కీలకమైన మున్నూరుకాపు కులస్తుల సంఖ్యను కూడా ప్రభుత్వం అతి తక్కువగా చూపింది. సర్కారు ప్రకటించిన లెక్కల ప్రకారం చూస్తే 13,71,413 మంది మున్నూరుకాపులు, 17,06,867 మంది రెడ్డిలు ఉన్నారు. అంటే మున్నూరుకాపుల కంటే 3,35,413 మంది రెడ్డిలు ఎక్కువగా ఉన్నారు. ఇది ఎవరైనా నమ్ముతరా..? ఒక్కసారి ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరుకాపు సంఘాలు, మున్నూరుకాపు సంఘాల అనుబంధ సంఘాలు అంతర్గతంగా నిర్వహించిన లెక్కల ప్రకారం.. దాదాపు 24 లక్షల జనాభా ఉన్నట్టు తేలింది. ఈ సంఖ్య కంటే ఐదు పదివేలు అటీటుగా ప్రభుత్వం ప్రకటించే సంఖ్య ఉంటుందని మేం భావించాం. కానీ, 13 లక్షల మంది మాత్రమే ఉన్నారని ప్రకటించడం అత్యంత దుర్మార్గం. మా అంచనాల కంటే దాదాపు 11 లక్షల మందిని తక్కువగా చూపడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఇది కేవలం మున్నూరుకాపులను రాజకీయంగా అణగదొక్కేందుకు, రెడ్లకు అవకాశాలు కల్పించుకోవడానికి చేపట్టిన కుట్రగానే భావిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. తప్పుడు లెక్కలపై పోరాటం సాగిస్తాం.
– వొడ్నాల రాజశేఖర్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు (జగిత్యాల జిల్లా)
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన బీసీలను ముంచే విధంగా ఉన్నది. అసలు కుల గణన చేసిందే బీసీలను ముంచేందుకేనని అర్థమవుతున్నది. ప్రభుత్వం ఇచ్చిన కులాల లెక్కలు వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ ఒక రెడ్డి కుటుంబం ఉంటే, దానికి ప్రతిగా గౌడ, యాదవ, కురుమ, పద్మశాలీ, మంగలి, చాకలి, ముదిరాజ్, కాపు, విశ్వకర్మ వంటి బీసీ కులాల కుటుంబాలు వందల సంఖ్యలో ఉంటాయి. అసలు రెడ్డి సామాజిక వర్గం లేని ఊర్లు ఉంటాయేమో గానీ, బీసీలు లేని ఊరంటూ ఈ రాష్ట్రంలో ఉండదు. ఇది క్షేత్రస్థాయిలో ఎవరిని అడిగినా చెప్పే సత్యం. పద్మశాలీ, ముదిరాజ్, మున్నూరు కాపు తదితర కులాల జనాభా లెక్కపై సైతం తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఈ కులాలే కాదు, అసలు బీసీ కులాల లెక్కలన్నీ తప్పుల తడకగానే ఉన్నాయి. పద్మశాలీ వంటి బలమైన బీసీ సామాజిక వర్గాల జనాభా కూడా రెడ్డిల జనాభా కంటే తకువగా లెకల్లో చూపించడం అత్యంత హాస్యాస్పదం. గ్రౌండ్ రియాలిటీకి, ఈ ప్రభుత్వ లెకలకు ఎకడా పొంతన కుదరడం లేదు. అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టలేరు. రాబోయే రోజుల్లో ప్రజలే వీరికి బుద్ధి చెబుతారు.
– దాసరి ఉష, బీసీ జేఏసీ జిల్లా చైర్పర్సన్(పెద్దపల్లి)