Veenavanka | వీణవంక, మార్చి 2: రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టగా విధులు నిర్వహించిన వారికి ఇంత వరకు బిల్లులు చెల్లించలేదని, వాటిని వెంటనే చెల్లించే విధంగా చొరవచేపాలని బొంతుపల్లి సర్పంచ్ బావు సంపత్, మాజీ ఉపసర్పంచ్ చదువు జితేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో కులగణన సర్వే బిల్లులు చెల్లించాలని ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ 2024 చివర్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కుల, సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య తదితర అంశాలతో కూడిన సర్వే చేపట్టినట్లు చెప్పారు. కాగా ఆ సర్వేలో భాగంగా వీణవంక మండలంలో మండల స్థాయి అధికారులను సూపర్ వైజర్లుగా, పంచాయితీ కార్యదర్శులను వీవోలుగా, అంగన్వాడీ టీచర్లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించి సర్వే చేయించినట్లు తెలిపారు.
ఒక్క వీణవంక మండలానికే రూ.20 లక్షల వరకు బిల్లులు రావాలని, జిల్లా అంతటా ఇదే పరిస్థితా లేక కేవలం వీణవంక మండలానికే రాలేదా అనే విషయాన్ని పరిశీలించి, వెంటనే సర్వేలో పని చేసిన వారందరికీ బిల్లులు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను కోరినట్లు పేర్కొన్నారు.