Vegurupalli | మానకొండూరు రూరల్, జనవరి 12 : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి శివారులోని ఓ వ్యవసాయ బావిలో కారు ఆచూకీ లభ్యమైంది. ఆ బావి వద్ద పోలీసులు బావిలోని నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. ఊటూర్ గ్రామానికి చెందిన సంగేం రాజు తండ్రి మరణానంతరం తల్లితో కలిసి హైదరాబాద్‌లో రాజు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జనవరి 3న రాత్రి స్వగ్రామం ఊటూర్‌కు వెళ్తున్నానని చెప్పి సెల్ఫ్ డ్రైవ్ కారును అద్దెకు తీసుకుని వెళ్లినట్లు తల్లి తెలిపింది.
అప్పటి నుంచి అతని సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. వెగురుపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావికి సమీపంలో ఓ కారు ప్రయాణించి పడిపోయినట్లు సోమవారం ఆనవాళ్లు గుర్తించారు. ఈ వ్యవసాయ భావి సమీపంలో సీఐ సంజీవ్, పోలీసులు, రెస్క్యూ టీమ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగించారు. బావిలో నీరు ఎక్కువగా ఉండడం దానికి తోడు పూడిక ఎక్కువగా ఉండడంతో బావిలో పడిపోయిన కారును తీసేందుకు సహాయ చర్యలు చేపట్టేందుకు తీవ్ర ఇబ్బందులు కావడంతో, మంగళవారం కరంటు మోటార్లు పెట్టి సహాయక చర్యలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కారుగాని బయటకు వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి అద్దెకు తీసుకొచ్చిన కారే వెగురుపల్లి శివారులోని వ్యవసాయ బావిలో పడినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. గత వారం రోజులుగా కనిపించకుండా పోయిన రాజు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈనెల 5న రాజు తల్లి మానకొండూర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.