Odela | ఓదెల, జూన్ 12: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలని కోరుతూ ఆ పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ప్రజాప్రతినిధులు వినూత్నంగా ప్రచార రథంతో శుక్రవారం గ్రామంలో తిరుగుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇక్కడ పాఠశాలలో సౌకర్యాలతో పాటు విద్యా బోధన జరుగుతుందని తెలుపుతున్నారు. ఈ పాఠశాలలో సౌకర్యాలు, సాధించిన విజయాలను తెలిపే కరపత్రాలను ముద్రించి ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలను తలపించే విధంగా ఇక్కడ ప్రభుత్వ బడుల ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు.
ప్రైవేట్ బడుల మోజు వద్దని ప్రభుత్వ బడిలో పేద ప్రజలకు అన్ని రకాల ఉచితాలు అందుతున్న తీరును వివరిస్తున్నారు. ఇక్కడ వినూత్నంగా ప్రచార రథం వినియోగించడం ప్రజలను ఆకట్టుకుంటుంది. కాగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఈసారి ఉపాధ్యాయులు వివిధ రకాల ప్రచారాలతో ప్రజల దగ్గరకు వెళుతున్నారు. పిట్టల ఎల్లయ్య పల్లె లో విద్యార్థి అడ్మిషన్ తో పాటు ఉపాధ్యాయులు ఇంటికి మొక్కను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చొప్పరి సంధ్య-కుమార్, ఎంఈవో రమేష్, ఉపాధ్యాయులు, జీపీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.