కార్పొరేషన్, ఆగస్టు 9: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్‌గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బీసీలు తరలిరావాలని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. కరీంనగర్లో బీసీ సభ కోసం ఐదు నియోజకవర్గాల ఇన్చార్జిలు శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశమయ్యారు.
శాసనమండలి బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ సమావేశమై, సభ నేపథ్యంలో జన సమీకరణ అంశంపై చర్చించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో బీసీలను తరలించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్ల గురించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీసీల రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు.