రాజన్న భక్తులతో వారిది పది తరాల అనుబంధం.. వందల ఏళ్లుగా వ్యాపారాలు నిర్వహిస్తూ దర్శనానికి వచ్చి వెళ్లే వారికి కావాల్సిన అనేక రకాల వస్తువులను విక్రయించి మంచి గుర్తింపు పొందారు. గతంలో మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు కోసం కొంత భూభాగం కోల్పోయిన వారు, ప్రస్తుతం 80 అడుగుల మేర రోడ్డు విస్తరణ పనుల్లో మొత్తం కోల్పోతున్నారు. దీంతో తాము తరతరాలుగా సొంత భవనాల్లో చేస్తున్న వ్యాపారాలు కోల్పోయి, అద్దె భవనాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తున్నదని, పోటీ ప్రపంచంలో తట్టుకునే విషయంలో రాజన్నపైనే భారం వేస్తున్నామంటూ ఆవేదన చెందుతూ ‘నమస్తే తెలంగాణ’తో తమ అనుబంధాన్ని పంచుకున్నారు.
వేములవాడ, జూన్ 17 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రోడ్డును విస్తరిస్తుండగా, దారి వెంట 243 మంది తమ దుకాణాలు, ఇండ్లు కోల్పోతున్న విషయం తెలిసిందే. అయితే, ఇందులో పలువురు నిర్వాసితులు కోర్టుకు వెళ్లగా, వారి భవనాలు మినహా మిగిలినవారి ఇండ్లు, దుకాణాలను కూల్చివేస్తున్నారు. దాదాపు 10 జేసీబీలు, హిటాచీలతో మంగళవారం ఉదయం నుంచే పనులు మొదలు పెట్టారు. ముదిరాజ్ వీధి నుంచి మటన్ మారెట్ దాకా రెండు, మూడు అంతస్థుల్లో భవనాలు ఉండగా, ఎక్స్కవేటర్లతో వాహనాలతో నేలమట్టం చేస్తున్నారు.
వేములవాడ ప్రధాన రహదారిలో వందేళ్లుగా బంగారం వర్తక వ్యాపారం మీదే ఉన్నాం. బొడ్ల భూమయ్య బంగారం దుకాణం పేరుతో ప్రజలందరికీ మేం సుపరిచితులం. ఒకప్పుడు ఇది ప్రధాన రహదారిగా ఉండడంతో మా సొంత భవనంలో వ్యాపారాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ రహదారితో మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందరూ బొడ్ల భూమయ్య దుకాణం అనే పేరు కేరాఫ్ అడ్రస్‌గా కూడా పెట్టుకుంటారు. గతంలో జరిగిన విస్తరణలో పాక్షికంగా దుకాణాలు పోగా ప్రస్తుతం మొత్తం కోల్పోయే పరిస్థితి ఉంది.
– బొడ్ల అశోక్, వడ్ల భూమయ్య జ్యువెలర్స్ యజమాని,(వేములవాడ )
వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి 12 అడుగులుగా ఉన్నప్పటి నుండి మా దుకాణం ఉంది. మా తాత ముత్తాతల నుంచి పది తరాలుగా ఇదే వ్యాపారాన్ని ఇకడే చేస్తున్నాం. వారసత్వంగా వస్తున్న వ్యాపారంగా పెరిగిన పోటీని తట్టుకొని కొనసాగిస్తున్నాం. సొంత దుకాణంలో మొదటి నుంచి కొనసాగిస్తూ వచ్చాం. 40 ఏళ్ల క్రితం జరిగిన విస్తరణలో పాక్షికంగా దుకాణం పోగా ప్రస్తుతం మొత్తం పోతుంది. పెరిగిన పోటీని తట్టుకొని నిలుచోవాలంటే రాజన్నపై భారం వేసి ముందుకు నడవాల్సిన పరిస్థితి ఉంది.
– కొమ్మ శంకర్, కొమ్మ సత్తయ్య దుకాణం యజమాని (వేములవాడ )
వేములవాడ రాజన్న ఆలయం ఎదుట పాన్ షాప్ అంటే డబ్బా రాజయ్యగా మాకు పేరు ఉంది. ఇంటి పేరు పోయి డబ్బానే ఇంటి పేరయింది. 1963 నుంచి మా తండ్రి రాజయ్య దుకాణం పెట్టి నడిపిస్తూ వచ్చారు. 2003లో ఆయన తర్వాత పూర్తిగా మేమే బాధ్యతలు చూస్తున్నాం. వేములవాడ పట్టణ ప్రజలతోపాటు రాజన్న సన్నిధికి వచ్చే భక్తులు, ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారికి ఇకడి నుంచి పాన్ కట్టి పంపేవాళ్లం. ఈ దుకాణం ద్వారానే మేం జీవనోపాధి పొందినప్పటికీ రహదారి విస్తరణ అందరికీ మంచి పరిణామమే. కానీ, రూ.60 లక్షల విలువ గల మా దుకాణానికి రూ.6 లక్షల పరిహారం అందించడమే బాధాకరంగా ఉంది. మొదటిసారిగా అద్దె దుకాణంలో తాము దుకాణాన్ని నడిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
– కొప్పుల శేఖర్, డబ్బా రాజయ్య, పాన్ షాప్ యజమాని (వేములవాడ)