జ్యోతినగర్, సెప్టెంబర్ 8: పెండ్లి కుదిరి, ఎంగేజ్మెంట్ జరిగిన 15 రోజులకే ఎన్టీపీసీకి చెందిన బీఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నది. గుజరాత్‌లోని గాంధీనగర్ బీఎస్ఎఫ్ క్యాంపు క్వార్టర్లో శనివారం రాత్రి జరిగిన ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ సుభాష్‌నగర్‌కు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ బల్ల్ల గంగాభవాని(26) గుజరాత్‌లోని గాంధీనగర్‌లో పనిచేస్తున్నది.
నెల రోజుల క్రితం లాంగ్‌లీవ్ తీసుకొని ఇంటికి వచ్చింది. తన సోదరులతో రాఖీ పండుగను సంతోషంగా జరుపుకున్నది. ఇదే క్రమంలో పెండ్లి కుదరగా, ఆగస్టు 22న ఎంగేజ్మెంట్ అయింది. డిసెంబర్ 5న పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 1నే తిరిగి గుజరాత్‌కు వెళ్లి విధులకు హాజరైంది. శనివారం హెడ్‌క్వార్టర్‌లో మధ్యాహ్నం 12 నుంచి 3గంటల వరకు సెంట్రింగ్ డ్యూటీ చేసి, తన నివాసం 2టైపు 120క్వార్టర్‌కు వెళ్లింది. కిటికీ ఇనుప గ్రిల్‌కు ఉరేసుకుంది.
రాత్రి 9 గంటలకు గంగాభవానీ డ్యూటీకి రాకపోవడంతో అధికారులు ఆమె క్వార్టర్‌కు వెళ్లారు. తలుపు గడియపెట్టి ఉండడంతో దంతివాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు తొలగించారు. గంగాభవాని ఉరేసుకొని చనిపోయి ఉండడంతో కేసు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సాయంత్రం గంగాభవాని మృతదేహం ఎన్టీపీసీకి చేరుకోగా, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని రామగుండం తహసీల్దార్ కుమారస్వామి సందర్శించి నివాళులర్పించారు. గంగాభవానికి తండ్రి బల్ల సుబ్రమణ్యం, తల్లి సరస్వతి, సోదరులు శివశంకర్, గణేశ్ ఉన్నారు.