కరీంనగర్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బీఆర్ఎస్ గడపగడపకూ చేరువైంది. నాటి ఉద్యమం నుంచి నేటి బంగారు తెలంగాణ దాకా గుండెగుండెనూ తాకింది. అందుకే ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఆది నుంచీ అధినేత కేసీఆర్‌కు జైకొడుతున్నది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుండగా, ఈ రెండు ఎన్నికలను పరిశీలిస్తే.. ప్రజాదరణ ఎంతగా ఉన్నదో అర్థమవుతున్నది. ఇదే సమయంలో గులాబీ పార్టీని ఓడించేందుకు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ వివిధ పార్టీలతో జతకట్టినా ప్రజలు దూరం పెడుతూనే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. హస్తం పార్టీకి ప్రజల మద్దతు అంతంతే ఉండగా, కమలం పార్టీని మాత్రం దాదాపు కనుమరుగు చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలుపుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. 2018 – 2023 మధ్య ప్రతి నియోజకవర్గంలోనూ అంచనాలకు మించి అభివృద్ధి జరిగిందని, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందాయని, అందుకే గతం కన్నా ఈ సారి అదనపు మద్దతు పెరుగుతుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టోకు ఊహించని స్పందన వస్తుండగా, అనుకున్న ప్రకారం ఓట్లు వస్తే బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో మరో రికార్డును సొంతం చేసుకుంటుందని చెబుతున్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి మొదలుకొని నేటి వరకు.. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్కే అండగా నిలుస్తున్నది. శాసనసభ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికలకు వరకు ప్రతి నియోజకవర్గంలోనూ జైకొడుతున్నది. రాష్ట్రంలో అతి కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కారుకే ఓటేసి, గులాబీపార్టీకి తిరుగులేని మద్దతునిచ్చింది. గడిచిన రెండు ఎన్నికలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన రెండు శాసనసభ ఎన్నికలను పరిశీలిస్తే.. బీఆర్ఎస్కు ప్రజాదరణ ఎంతగా ఉన్నదో అర్థమవుతుంది. 2014 ఎన్నికలతో పోలిస్తే.. 2018 ఎన్నికల్లో మూడు శాతం ఓట్లు అదనంగా వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2014లో 12 స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించగా, మొత్తం 9,88,871(48.40 శాతం) ఓట్లు దక్కాయి. అదే, 2018 ఎన్నికల్లో 11,41,618 (51.47 శాతం) ఓట్లు వచ్చాయి. అంటే, 2014తో పోలిస్తే అదనంగా 1,52,747 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో మంథని, రామగుండం స్థానాల్లో గులాబీ అభ్యర్థులు ఓడిపోయినా.. ఆనాడు ఆ రెండు చోట్లా ఓటింగ్ శాతం మాత్రం పెరిగింది. అంటే, ఏయేటికాయేడు ప్రజలు బీఆర్ఎస్కు తమ మద్దతును పెంచుతున్నట్టు స్పష్టమవుతున్నది.
రికార్డు స్థాయిలో బీఆర్ఎస్కు మద్దతు
ప్రతి ఎన్నికల్లో ఒకటి రెండు స్థానాలు చేజారుతున్నా.. మెజార్టీ స్థానాలు గులాబీ వశం అవుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ను ఓడించేందుకు ఆయా పార్టీలు ఒక్కో పార్టీతో జతకట్టి గత రెండు ఎన్నికల్లో బరిలోకి దిగాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీతో జతకట్టి బరిలోకి దిగగా, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ సీపీఐతోపాటు ఇతర పార్టీలతో జతకట్టి ప్రజాకూటమిగా పోటీ చేశాయి. అయినా, ఆ పార్టీలకు ప్రజల నుంచి ఆదరణ దక్కలేదు. ఓటింగ్ సరళిని చూస్తే ఇది అర్థమైంది. నిజానికి ఉమ్మడి జిల్లా చరిత్రను ఒక్కసారి పరిగణలోకి తీసుకొని చూస్తే.. గతంలో అసెంబ్లీ కోసం జరిగిన ఏ ఏన్నికల్లోనూ ఒక పార్టీకి 47 శాతం మించి ఓట్లు రాలేదు. కానీ, బీఆర్ఎస్ మాత్రం 2014 ఎన్నికల్లో 9,88,871 ఓట్లు సాధించి ( 48.40 శాతంతో) విజయకేతాన్ని ఎగురవేసింది. అలాగే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 51.47 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకున్నది. ఇదో రికార్డు. అప్పుడు ఉమ్మడి జిల్లాలో మొత్తం 22,17,710 ఓట్లు పోలు కాగా, అందులో గులాబీ పార్టీకి 11,41,618, ప్రజాకూటమికి 7,02,803, బీజేపీకి 1,40,708 ఓట్లు వచ్చాయి. కాగా, 13 నియోజకవర్గాల్లో కలిపి ఇతరులకు 2,32,581 ఓట్లు వచ్చాయి.
ప్రజాదరణలేని ప్రతిపక్షాలు
రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు రెండు సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. అయితే, ఆ రెండు సార్లూ బీఆర్ఎస్ను ఓడించడంతోపాటు ప్రజల్లో అబాసుపాలుచేసేందుకు కాంగ్రెస్, బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పేరుకు జాతీయ పార్టీలుగా చెప్పుకొన్నా ప్రజల్లో మాత్రం ఆదరణ పొందలేకపోతున్నాయి. దీనికి ఆయా పార్టీలు గడిచిన రెండు ఎన్నికల్లో సాధించిన ఓట్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఆయా పార్టీల అభ్యర్థులకు 2,72,754 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయగా.. మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. అంతేకాదు, పదమూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి 1,40,708 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే, 2014 ఎన్నికలతో పోలిస్తే ఏడు శాతం ఓట్లు తగ్గాయి. దీనిని బట్టి చూస్తే.. కమలం పార్టీ రోజురోజుకూ కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. కాంగ్రెస్ పరిస్థితి అంతంతే ఉన్నది. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీకి 51.47 శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్‌కు అది కూడా అన్ని పార్టీలు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి పోటీ చేసినా 31.69 శాతం ఓట్లు వచ్చాయి. గులాబీ పార్టీని ఓడించేందుకు ప్రజాకూటమిగా జత కట్టినా.. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ కంటే 4,38,815 ఓట్లు అధికంగా వచ్చాయి.
మరింత పెరుగనున్న మద్దతు
గడిచిన రెండు ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్కు అపూర్వ మద్దతు లభించగా, వచ్చే నెల 30న మూడోసారి జరిగే ఎన్నికల్లో మరింత ఆదరణ పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు అనేక కారణాలు దోహదపడుతాయంటున్నారు. ప్రధానంగా 2018 నుంచి 2023 మధ్య ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది. వ్యవసాయ రంగ పరంగా చూస్తే గతంతో పోలిస్తే.. సాగునీటి రంగం వందకు వంద శాతం మెరుగుపడింది. తద్వారా ప్రతి నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం గతం కన్నా 70 నుంచి వంద శాతం పెరిగింది. అలాగే, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందుతుండగా, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మరింత పకడ్బందీగా ప్రభుత్వం చేపడుతున్నది. దీంతో రైతులు సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశమున్నది.
అలాగే, గడిచిన ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా దివ్యాంగులు, వృద్ధులకు ఆసరా పింఛన్లు పెంచి ఇస్తుండగా, ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటే. ఇవే కాదు, సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు అమలుచేస్తుండగా, వాటి ఫలాలు ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్నాయి. వీటితోపాటు 2023 ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఇచ్చిన మ్యానిఫెస్టో ప్రజల గుండెలకు తాకుతున్నది. పింఛన్ల పెంపుదల, అందరికీ సన్న బియ్యం, కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా, రైతుబంధు సాయం పెంపు, అర్హులైన మహిళలకు నెలకు 3 వేల భృతి, 400కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ కింద గరిష్ఠ పరిమితి 15 లక్షలకు పెంపు, పేదలకు ఇండ్ల స్థలాలు, అగ్రవర్ణాల పేద పిల్లలకు గురుకులాలు, ఉద్యోగుల సీపీఎస్‌పై అధ్యయన కమిటీ వంటివి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఏ ఊరిలో చూసినా జోరుగా చర్చ సాగుతున్నది. అంతేకాదు, గతంలో ఇచ్చిన మ్యానిఫెస్టోను తూచ తప్పకుండా అమలు చేస్తున్న బీఆర్ఎస్ ఈసారి చెప్పిన హామీలను కూడా తప్పకుండా అమలుచేసి తీరుతుందన్న నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లోనే బీఆర్ఎస్కు ప్రజల మద్దతు మరింత పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.