సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 12 : అభివృద్ధిలో సిరిసిల్లను ఆదర్శంగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్వైపే సిరిసిల్ల ప్రజలు నిలుస్తారని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్వైపే ఉంటారని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ప్రజలు కాంగ్రెస్ పనితీరును గమనించారని, మున్సిపల్ ఎన్నికల వేళ ఆ పార్టీ దౌర్జన్య కాండను కళ్లారా చూశారని చెప్పారు. అందుకే నేతన్నల పక్షాన నిలిచే కేటీఆర్వెంటే నడుస్తున్నారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు.. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. వస్త్ర పరిశ్రమకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లించేది లేదని, కొత్త ఆర్డర్లు ఇచ్చేది లేదని బెదిరించారని మండిపడ్డారు. కులాలు, మతాలు దేవుళ్ల పేరిట ఓట్లడిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి నేత కార్మికులను ఆదుకోవాలన్న కనీస సోయి లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీఆర్ఎస్తోనే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు చెంపపెట్టులా నిలుస్తాయన్నారు.
నెల రోజులుగా కౌన్సిలర్ అభ్యర్థుల విజయం కోసం శ్రమించిన పార్టీ శ్రేణులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతాన్ని కేవలం పదేళ్ల పాలనలో అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. సిరిసిల్ల ప్రజలందరూ అభివృద్ధి ప్రధాత కేటీఆర్ నిలబెట్టిన అభ్యర్థులను ఆశీర్వదిస్తున్నారని, ఎన్నికల ఫలితాల తర్వాత సిరిసిల్ల మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగురబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మ్యాన రవి, ఎండీ సత్తార్, అంకారపు రవీందర్, జక్కుల రవీందర్, మిట్టపెల్లి జవహర్‌రెడ్డి, బుర్ర మల్లికార్జున్, అడిచెర్ల సాయికృష్ణ, వేముల రాములు, అడ్డగట్ల మాధవి, పందిర్ల పర్శరాములు, సామల శ్రీనివాస్, గుగ్గిళ్ల అజయ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.