ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా నిలిచే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై కాంగ్రెస్ సర్కారు కాఠిన్యం ప్రదర్శిస్తోంది. గద్దెనెక్కడానికి ఎన్నికలకు ముందు ఇష్టానుసారం హామీల వర్షం కురిపించిన నాటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే అన్నీ మరిచి పోయినట్లు కనిపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను తక్షణం చెల్లిస్తామని, కొత్త పీఆర్సీ ప్రకటించి.. ఆరు నెలల్లోపు సిఫారసులు అమలు చేస్తామని ఏకంగా మేనిఫెస్టోలో ప్రకటించింది. అంతే కాకుండా, అనేక రకాల హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కటి కూడా ఆచరణలో అమలు చేయకపోవడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. కానీ, గతంలో కేసీఆర్ అధికారం చేపట్టిన వెంటనే.. ఉద్యోగులకు అండగా నిలిచారు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ పేరుతో వారిపై కరుణ చూపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు విడుతల్లో 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. తమ కోసం అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని ప్రస్తుతం ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఆశపడి గోస పడుతున్నామన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.
స్వరాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. అందులో భాగస్వాములైన ఉద్యోగులకూ అదే ప్రాధాన్యత ఇచ్చారు. అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మొదలు.. చివరి వరకు ఉపాధ్యాయ, ఉద్యోగులతో ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని నడుపుతూనే ఉద్యోగులు సగర్వంగా తలెత్తుకునేలా వేతనాలు పెంచారు. గత రెండు పీఆర్సీల్లో దేశంలోనే అత్యధిక ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షన్ దారులకు పెంచిన వేతనాలు, ఇచ్చిన ఫిట్మెంట్లు, పెరిగిన గ్రాట్యుటీ, అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాలను ఒకసారి నెమరువేసుకుంటే.. కేసీఆర్ ఉద్యోగులకు ఎలా అండగా నిలిచారో అర్థమవుతుంది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే 2014లోనే తెలంగాణ ఇంక్రిమెంట్‌ను పూర్తికాలం పనిచేసేలా ఇచ్చారు. ఉద్యోగుల పోరాటాన్ని గుర్తించి ఇంక్రిమెంట్ ఇచ్చిన ఘతన కేసీఆర్‌కే దక్కింది. 2014 పీఆర్సీలో భాగంగా వేతన స్కేళ్లను సవరించిన ప్రభుత్వం.. ఉద్యోగుల అంచనాలకు భిన్నంగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించి ఉద్యోగులపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. 43 శాతం ఫిట్మెంట్ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇక్కడితో ఆ ప్రస్థానం ఆగలేదు. 2018 పీఆర్సీకి సంబంధించిన నివేదికను 2020 డిసెంబర్ 31న ఆనాటి కమిటీ చైర్మన్ బిస్వాల్ ప్రభుత్వానికి సమర్పించారు. ఏడు శాతం ఫిట్మెంట్ పెంచడానికి కమిటీ సిఫారసు చేయగా.. ఆ నివేదికను పక్కన పెట్టి.. అసెంబ్లీ సాక్షిగా 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించి కేసీఆర్ అనాడే ఉద్యోగులపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. స్వరాష్ట్రంలో రెండు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కింది. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దమొత్తంలో ఫిట్మెంట్ నేటి వరకు పెంచలేదు. భవిష్యత్‌లో పెంచుతారన్న సూచనలు కూడా కనిపించడం లేదు. నిజానికి సమైక్య రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో 16 శాతం, చంద్రబాబు హయాంలో 25 శాతం ఫిట్మెంట్ మాత్రమే ఆనాటి ప్రభుత్వాలు ప్రకటించాయి.
కానీ, కేసీఆర్ మాత్రం వీటికి భిన్నంగా ముందుకు వెళ్లారు. చివరగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ చైర్మన్‌గా పీఆర్సీ కమిటీని నియమిస్తూ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 159ను జారీ చేసిన విషయం తెలిసిందే. నివేదికను ఆరు నెలల్లోపు ఇవ్వాలని నిర్దిష్ట గడువు పెట్టడంతోపాటు.. 5 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని చెల్లించాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికలు జరగడం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఫిట్మెంట్ ఒక్కటే కాదు.. 2014కు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయుల గ్రాట్యుటీ రూ.8 లక్షలు ఉంటే దానిని 2014లో రూ.12 లక్షలకు 2018 పీఆర్సీలో రూ.16 లక్షలకు పెంచింది. కేసీఆర్ సర్కారు హయాంలో గ్రాట్యుటీ డబుల్ అయింది. ఉపాధ్యాయ. ఉద్యోగుల కోరిక మేరకు రాష్ట్రంలో ఏదేని ఒక కేటగిరీలో పదోన్నతి పొందాలంటే మూడేండ్ల సీనియార్టీ ఉండగా, ఈ పరిమితిని రెండేండ్లకు తగ్గిస్తూ.. 2021 ఆగస్టు 30న జీవో నంబర్ 259ని జారీ చేసింది. స్పౌజ్ కేటగిరీలో భార్యాభర్తలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. అలాగే, కారుణ్య నియామకాలు, రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఉద్యోగులందరినీ తెలంగాణకు తీసుకొచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు, తద్వారా ఏర్పడిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, కోర్టులు వంటి వాటితో వేలాది మంది ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం ఏర్పడేలా చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 15 శాతం అదనపు పెన్షన్ కోసం వయో పరిమితిని 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61కి పెంచి 2021 మార్చి నుంచి అమలులోకి తెచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వైద్య పరీక్షలకు గరిష్ట పరిమితి ఎత్తివేసింది. ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం చేయడం ద్వారా 43 వేల మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు జరిగేలా చర్యలు తీసుకుంది. ట్రావెలింగ్ కన్వేయన్స్, ట్రాన్స్‌పోర్టు అలవెన్సును 30 శాతం పెంచింది. బిడ్డ పెళ్లికి అడ్వాన్స్ రూ.4 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇల్లు కట్టుకోవాలనే వారికి అడ్వాన్స్ పెంపు, బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్టు అలవెన్స్ 30 శాతం, షెడ్యూల్ ఏరియాలో పనిచేసే వారికి 30 శాతం అలవెన్సులను ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం పెంచింది. ఇవేకాదు.. మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. అడుగడుగునా ఉద్యోగుల సంక్షేమంపై ఆనాడు కేసీఆర్ దృష్టిపెట్టారు.
ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు సంబంధించి.. ఎన్నిలకు ముందు కాంగ్రెస్ అనేక హామీలు గుప్పించింది. ఏకంగా మేనిఫెస్టోలో అనేక హామీలను పొందుపరిచింది. బీఆర్ఎస్ సర్కారు కంటే గొప్పగా ఉద్యోగుల సంక్షేమంపై శ్రద్ధచూపుతామని పేర్కొంది. కానీ, ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. కనీసం ఉద్యోగ సంఘాలతో చర్చించి.. హామీలను అమలుచేసే సమయాలు చెప్పడం లేదు. ఎన్నికల ముందు మాట్లాడిన తీరుకు.. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు అసలు పొంతన లేదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించడమే కాకుండా ప్రధానంగా పెడింగ్‌లో ఉన్న మూడు డీఏలను అధికారం చేపట్టిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆ డీఏల సంఖ్య ప్రస్తుతం ఐదుకు చేరినా.. నేటి వరకు ప్రభుత్వం దానిపై నోరు మెదడపం లేదు. దసరాకు వస్తాయని భావించిన ఉద్యోగులకు నిరాశే ఎదరైంది. ఇప్పుడు దీపావళికి ఇస్తామన్నట్లుగా ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. అయితే, స్పష్టత మాత్రం లేదు. దీపావళికైనా వస్తాయా? లేదా? అన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే డీఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తామని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి, ఆరు నెలల్లోపు సిఫారసుల అమలు చేస్తామని గొప్పలు చెప్పింది. ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌తో అన్ని రకాల జబ్బులకు అన్ని దవాఖానాల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డు జారీ చేస్తామనిపేర్కొంది. ఇందులో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. ప్రధానంగా రాష్ట్రంలో గత మార్చి నుంచి ప్రతి నెలా వెయ్యి వంది వరకు ఉపాధ్యాయ, ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారు. వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉంది. వీటి కోసం దరఖాస్తు చేసుకొని.. ఆరు నెలలు దాటుతున్నా వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరడం లేదు. నిజానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని ప్రతి ఉద్యోగి వివిధ రకాల ప్లాన్స్ చేసుకొని ఉంటారు. కానీ.. గత మార్చి నుంచి నేటి వరకు.. రిటైర్ అవుతున్న ఏ ఒక్కరికీ బెనిఫిట్స్ అందక ఆందోళన చెందుతున్నారు. వివిధ అసరాల కోసం తెచ్చిన అప్పులకు ఉద్యోగులు వడ్డీలు కడుతున్నారు. ఇది మచ్చుకు మాత్రమే.. ఇటువంటి అనేక అంశాల్లో కాంగ్రెస్ సర్కారు కాఠన్యమే చూపుతోంది. ఈ నేపథ్యంలోనే.. నాటి కేసీఆర్ సర్కారుకు.. నేటి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి బేరీజు వేసుకుంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛన్‌దారులు చర్చించుకుంటున్నారు. ఆశకు పోతే గోస పడుతున్నామనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం.. ఇక ఉద్యమ బాట పట్టాల్సిందేనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. ఇదే బాటలో పెన్షన్‌దారులు ముందుకు వెళ్తున్నారు.