బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా వచ్చే నెల 27న వరంగల్‌లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నం. సుద్దాల హన్మంతు రాసిన ‘బండెనుక బండి కట్టి’ అనే పాటను స్ఫూర్తిగా తీసుకుని పెద్ద సంఖ్యలో తరలి రావాలి. ఏ బండి దొరికితే ఆ బండి వేసుకొని ఊరూరు నుంచి సోదరీ, సోదరీమణులు సల్లటి పూట బయలుదేరాలి. దేశం మొత్తం నివ్వెరపోయేలా లక్షలాది మంది కదలిరావాలి. మన పార్టీ అయిపోయిందని మాట్లాడే సన్నాసుల నోర్లు మూతపడే విధంలా అద్భుతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
– కేటీఆర్
కరీంనగర్, మార్చి 23 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : వచ్చే నెల 27న వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి ఊ రు నుంచి సోదరీ, సోదరీమణులు సల్లటి పూట బయలుదేరాలని, దేశం మొత్తం నివ్వెరపోయేలా లక్షలాది మంది కదలిరావాలని కోరారు. కరీంనగర్ బొమ్మకల్‌లోని వీ కన్వెన్షన్‌లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు పూర్తయి16 నెలలు గడుస్తున్నాయ ని, ఇక మిగిలినవి మూడేండ్లేనని, అందులో ఈ ఒక్క సంవత్సరం మొత్తం సిల్వర్ జుబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకొందామని చెప్పారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉంటాయని, హైదరాబాద్‌తోపాటు 32 జిల్లా పార్టీ ఆఫీసుల్లో ఉద్యమ పార్టీగా తెలంగాణ ఎలా సాధించుకున్నామో కేసీఆర్ చెప్పినట్టు ఈ కాలం పిల్లలకు తెలిసేలా శిక్షణ శిబిరాలు, ఫొటో ఎగ్జిబిషన్, డాక్యుమెంటరీలు పెట్టుకుందామన్నారు. రజతోత్సవాల పర్యవేక్షణకు నియోజకవర్గాల వారీగా పరిశీలకులు, అబ్జర్వర్లను రాష్ట్ర పార్టీ నియమిస్తున్నదని తెలిపారు.
దమ్ముచూపిన గడ్డ కరీంనగర్
పోరాటాల పురిటిగడ్డ కరీంనగర్ అంటే కేసీఆర్‌కు సెంటిమెంట్ అని, ఇక్కడి నుంచి ఏ పని మొదలుపెట్టినా సూపర్ హిట్ అవుతుందనే విశ్వాసం ఉందని, అందుకే పార్టీ పెట్టిన తర్వాత 2001 మే 17న ఎస్సారార్ కళాశాల మైదానంలో మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన గ్రాండ్ సక్సెస్ అయిందని, అదే ఉద్యమానికే ఊపిరి పోసిందని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
ఉద్యమ సమయంలో తెలంగాణవాదం లేనేలేదంటూ కొంత మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడారని, రా జశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సంక్షే మ బాటలో తెలంగాణ వాదం కొట్టుకుపోయిందని చె ప్పి ఆనాటి పీసీసీ అధ్యక్షుడు పిచ్చి ప్రేలాపనలు చేస్తే దానికి స్పందిస్తూ కేసీఆర్ తన కరీంనగర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మీ దగ్గరికి వచ్చారని యాదికి తెచ్చారు.
అప్పుడు మీ బిడ్డ కేసీఆర్‌ను రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించి మొత్తం దేశానికి కరీంనగర్ దమ్మేందో.. తెలంగాణ దమ్మేందో.. చూపెట్టిన గ డ్డ కరీంనగర్ అని స్పష్టం చేశారు. అదొక్కటేకాదు సంద ర్భం ఏదైనా.. పరీక్ష ఏదైనా, అన్యాయం ఎప్పుడు జరిగినా, అణిచివేత జరిగినా, ఎలాంటి వివక్ష మన పట్ల ఉన్నా ప్రతి సందర్భంలో తిరుగుబాటు జెండాను ఎగురవేసి అగ్ర భాగాన నిలబడ్డ పోరాటాల పురిటి గడ్డ క రీంనగర్ అని చెప్పారు.
ఇక్కడికి వచ్చి నేను ఎక్కువ త క్కువ చెప్తే తాతకు దగ్గులు చెప్పినట్లు అయితదన్నారు. అందుకే ఇంకా మాట్లాడతలేనని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉందని, ఇక్కడ దమ్మున్న కార్యకర్తలు, నాయకులు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు సమావేశానికి ప్రతి మండలం నుంచి 150 మందిని పిలిస్తే వేలాది మంది తరలివచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ బలంగా ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు.
ఏదైనా బీఆర్ఎస్తోనే సాధ్యం
కమలాకర్ అన్న లెక్క ఓ గుడి తెచ్చింది లేదని, తెచ్చినా గుడిని పూర్తి చేయరని, మళ్లా కమలాకరన్నా పూనుకుంటేనే అయిందే తప్పా ఏ బీజేపోడు ఏం చేయడని కేటీఆర్ విమర్శించారు. గుడి కట్టినా, బడి కట్టినా, కరీంనగర్‌కు మెడికల్ కాలేజీ తెచ్చినా, కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసినా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి టేలెండ్ ప్రాంతాలైన హుజూరాబాద్, హుస్నాబాద్, ఇంకా పెద్దపల్లి, చొప్పదండి చివరి గ్రామాలను సస్యశ్యామలం చేసినా అది కేసీఆర్ ఘనతేనని కొనియాడారు.
ఇంకా అటు అప్పర్ మానేరు డ్యాం నుంచి కింద గోదావరి దాకా, మంథని నియోజకవర్గంలో మానేరు నదిని ఒక సజీవ జల దృశ్యంగా మార్చినా, అదే విధంగా ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరద కాలువను ఒక రిజర్వాయర్‌గా మార్చి కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కూడా ఆయనదేనని ప్రశంసించారు. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సస్య శ్యామ లం చేయడమేకాదు, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లను కొత్తగా జిల్లాలుగా ఏర్పాటు చేసి జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ పెట్టింది బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు.
విద్య, వైద్యం ఇలా అందరికీ అన్ని చేసిన నాయకుడు కేసీఆర్ అని కీర్తించారు. ఈ కార్యకర్తల సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బాల్క సుమన్, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధూకర్, రాజేశం గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, వీర్ల వెంకటేశ్వర్రావు, కర్ర శ్రీహరి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఉమ్మడి జిల్లాల పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, తోట ఆగయ్య, జడ్పీ మాజీ అధ్యక్షులు తుల ఉమ, కనుమల్ల విజయ, దావ వసంత, వర్షిణి, న్యాలకొండ అరుణ, కరీంనగర్ నగర పార్టీ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు పొన్నం అనిల్ కుమార్, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈసాబ్ కిసాబ్ అన్నీ చూస్తం
మనోళ్లు సోషల్ మీడియాలో పోస్టు పెడితే చాలు పోలీసోళ్లు ఎక్కువ చేస్తున్నరు. వాళ్లు దొంగలను పట్టుకునుడు ఏనాడో మరిచిపో యిన్రు. బీఆర్ఎస్ ఎంబడి పడుడే నేర్చుకు న్నరు. నేను మీకు ఒకటే మాట ఇస్తున్న. కేసీఆర్ అంత మంచోన్ని కాదు. మళ్లా బరాబర్ మన టైం వస్తది. వదిలిపెట్టే సమస్య లేదు. రిటైర్డ్ అయినా, వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్చేస్తాం. ఈసాబ్ కిసాబ్ అన్నీ చూస్తం.
– కేటీఆర్
మీకోసం కష్టపడుతాం
స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే మీ కోసం కష్టపడుతం. తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతం. మీరు గెలిచి వచ్చే విధంగా పని చేస్తామని మాట ఇస్తున్నం. మీరంతా కష్టపడితేనే ఈ స్టేజీ మీద కూర్చున్నం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు చైతన్యవంతులు. ఎందుకో కానీ పోయినసారి కరీంనగర్లో మనం మెజార్టీ సీట్లు గెలువలే. ఈ సారి కచ్చితంగా 13 సీట్లలో గులాబీ జెండా ఎగిరేలా ఎక్కడోళ్లమక్కడ ఏ గ్రామానికి, ఆ గ్రామానికి కథా నాయకులమై గెలిపించుకోవాలి.
– కేటీఆర్
తెలంగాణను కాపాడేది కేసీఆరే
ఇప్పుడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా గుర్తుకొ స్తున్నది మన నాయకుడు కేసీఆరే. తెలంగాణను కాపాడాలంటే ఒకే ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యం. పదేళ్లు సీఎంగా కేసీఆర్ పనిచేసిండు. ఆయనకేం పదవుల మీద మోజు లేదు. ఆయనకు కొత్తగా వచ్చే పదవి లేదు. ఇవాళ తిరిగి బీఆర్ఎస్ గెలువడం అనేది కూడా తెలంగాణ ప్రజల కోసం మాత్రమే. మనం గెలువాలే. నిలువాలే. కాంగ్రెస్, బీజేపీని ఊరూరా ఎండగట్టాలే.
– కేటీఆర్
అభిమానం తగ్గలేదు
రాష్ట్రంలో అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ చెక్కు చెదరలేదు. కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న అభిమానం తగ్గ లేదు సరికదా మరింత పెరిగింది. కరీంనగర్ జిల్లా అంటే ఉద్యమాల జిల్లా. బీఆర్ఎస్ చేపట్టిన ప్రతి ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంట్. 2001లో సింహగర్జన సభను ఇక్కడి ఎస్సారార్ కాలేజీలోనే నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు అనేక ఉద్యమాలు ఇక్కడి నుంచే పురుడు పోసుకున్నాయి. రాష్ట్రం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు వంటి అనేక ప్రభుత్వ పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేసీఆర్‌కు విడదీయలేని బంధం ఉన్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల 27న జరగబోయే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు కూడా ఇక్కడి నుంచే సన్నాహక సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరా. ఆయన వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు.
– గంగుల కమలాకర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే
కొత్త పాఠాలు నేర్చుకొని ముందుకెళ్లాలి
రాజకీయ పార్టీలకు గెలుపు, ఓటములు సహజం. ఓటమి వల్ల కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో కొత్త పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లాలి. ప్రజల కోసం చేయాల్సినవి ఇంకా ఏమున్నాయనే ఆలోచన చేసుకోవాలి. పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లకు చేరుకుంటున్న నేపథ్యంలో వరంగల్‌లో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ వేడుకలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నది. ఉద్యమ ప్రారంభంలో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారంతా చిన్న వయసు వాళ్లే. అప్పుడు తమను చూసిన వారంతా ఎగతాళిగా నవ్వారు. ఎన్నికల తర్వాత సాధించిన విజయాలను చూసి ఆశ్చర్య పోయారు. ఉద్యమ సమయంలో కొత్త తరం చేరినట్లుగానే ఇప్పుడు పార్టీలోకి కొత్త నీరు రావాలి. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉన్నందున వారు కూడా ముందుకు వచ్చి తమ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. బీఆర్ఎస్లో రాజకీ యంగా ఎదిగేందుకు మంచి అవకాశం ఉన్నది.
– బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
స్థానిక సంస్థల్లో గెలుపు మనదే
స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు మీరే కావాలి. ఇన్నాళ్లూ మీరు మా కోసం కష్టపడ్డారు. ఇప్పుడు మీ కోసం కష్టపతాం. కేటీఆర్ కరీంనగర్ గడ్డపై అడుగు పెట్టగానే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చా యి. కార్యకర్తలు వేల సంఖ్యలో తరలి వచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించాలి. ప్రతి గ్రామంలో సర్పం చులు మన వాళ్లే ఉండాలి. ఏప్రిల్ 27న జరిగే సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ అభిమానులను పెద్ద సంఖ్యలో తరలించాలి.
– పాడి కౌశిక్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే
రాష్ట్రంలో అరాచక పాలన
కాంగ్రెస్ రాష్ర్టాన్ని ఇప్పటికే పదిహేనేండ్లు వెనక్కి తీసుకెళ్లింది. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసింది. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నది. పోలీసు కేసులు పెట్టిస్తూ భయబ్రాంతుకు గురి చేస్తున్నది. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నం. కానీ, ఉద్యమాలతో సంబంధం లేని వ్యక్తి, తెలంగాణ అంటే కాల్చివేస్తానని, చేతిలో తుపాకీ పట్టుకుని తిరిగిన వ్యక్తి చేతిలోకి రాష్ట్రం వెళ్లింది. ఆయన కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ క్యాడర్‌పై ఉన్నది.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
ప్రతి కార్యకర్తా భాగస్వామ్యం కావాలి
చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో ఆరాటపడ్డారు. గొప్ప పథకాలు తెచ్చి రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. పదేండ్ల పాటు రాష్ర్టాన్ని కంటికి రెప్పలా కాపాడారు. కానీ, ఇప్పుడు తెలంగాణ ఆగమైంది. కేసీఆర్ ఆశయాలను, ఆరాటాన్ని బతికించడం కోసం కేటీఆర్ మరో ఉద్యమాన్ని చేపడుతున్నారు. ప్రతి కార్యకర్తా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. గులాబీ జెండాను ఎత్తుకుని తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తేవాలి. – రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే