అభిమాన నేత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరీంనగర్ గడ్డ మరోసారి జైకొట్టింది. తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్గేట్ నుంచి బొమ్మకల్ వీ కన్వెక్షన్ వరకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన సభకు కేటీఆర్ హాజరు కాగా, వేలాది మంది తరలివచ్చి అభిమానం చాటారు. ఆయన హాల్లోకి ప్రవేశించగానే ‘సీఎం’ ‘సీఎం’ అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్ తన ప్రసంగంతో ఆకట్టుకోగా, ఆద్యంతం ఆసక్తిగా వింటూనే జేజేలు పలికారు. కరీంనగర్ గురించి ప్రస్తావించి, ఇక్కడ దమ్మున్న కార్యకర్తలు ఉన్నారని అన్నపుడు కేరింతలు కొట్టారు. ఏప్రిల్ 27న వరం గల్లో నిర్వహించే రజతోత్సవ సభకు తరలిరావాలని పిలుపు నివ్వగా, కదిలి వస్తామంటూ ముక్తకంఠంతో చెప్పారు.
కరీంనగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరీంనగర్ గడ్డ మరోసారి నీరాజనం పలికింది. అభిమాన నేతకు దారిపొడువునా అపూర్వ సాగతం పలికింది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో ఆదివారం కరీంనగర్ బొమ్మకల్‌లోని వీ కన్వెక్షన్‌లో నిర్వహించిన సమావేశానికి కేటీఆర్ హాజరు కాగా, కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తించారు. ‘సీఎం’ ‘సీఎం’ అంటూ కేరింతలు కొట్టారు. ‘జై తెలంగాణ’ ‘జై కేసీఆర్’ ‘జై కేటీఆర్’ అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్‌పై ఉన్న అభిమానానికి నిదర్శనంగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.
మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షత వహించిన ఈ సభ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన వేలాదిమందితో నిండిపోయింది. సభలోపల ఎంత మందై తే ఉన్నారో బయట అంతకు రెండింతలు కనిపించారు. కేటీఆర్ మాట్లాడాలని గంగుల కమలాకర్ కోరిన సందర్భంలోనూ పెద్ద ఎత్తున నినదించారు. ‘సీఎం.. సీఎం’ అంటూనే.. ‘కేటీఆర్ జిందాబాద్’ ‘కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ చాలాసేపు ఆగకుండా నినదించారు. కార్యకర్తలను వారించి కేటీఆర్ తన ప్రసంగం ప్రారంభించారు.
దాదాపు 40 నిమిషాలకుపైగా ప్రసంగించి ఆకట్టుకున్నారు. కేసీఆర్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనను గుర్తు చేస్తూనే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను ఎండగట్టారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను కండ్ల ముందుంచారు. కాంగ్రెస్ నేతల అసూయ, ద్వేషం, ఆశతో తెలంగాణ ఆగమైందని వివరించారు. కరీంనగర్ గడ్డకు కేసీఆర్‌కు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూనే అందుకు ఉదాహరణలను చూపారు. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉందని, ఇక్కడ దమ్మున్న కార్యకర్తలు, నాయకులు ఉన్నారని కొనియాడారు.
ఏప్రిల్ 27తో బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్‌లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ ఒక్క సంవత్సరం మొత్తం వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకొందామనగా, కార్యకర్తలు, అభిమానులు జైకొట్టారు. కేటీఆర్ మాట్లాడుతున్నంతసేపు ఆద్యంతం ఆసక్తిగా విన్నారు.
సభ పూర్తయిన తర్వాత కేటీఆర్‌ను కలిసేందుకు పోటీ పడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహం చూపించారు. కేటీఆర్ భోజనం చేసేందుకు వెళ్లగా పెద్ద సంఖ్యలో బయట వేచి ఉన్నారు. ఆయన బయటికి రాగానే నినాదాలు చేశారు. కార్యకర్తల ఉత్సాహాన్ని గమనించిన కేటీఆర్ ఒక్కొక్కరితో కరచాలనం చేశారు. ఫొటోలు, సెల్ఫీలు దిగారు. సుమారు 20 నిమిషాలు అక్కడే గడిపారు. సమావేశ ప్రారంభంలో రసమయి బాలకిషన్ ఆటాపాటతో ఉర్రూతలూగించారు.
దారిపొడవునా జేజేలు
హైదరాబాద్ నుంచి వచ్చిన కేటీఆర్‌కు మొదట తిమ్మాపూర్ మండలం రేణికుంటలోని టోల్ గేట్ వద్ద మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో కార్లు, మోటర్ సైకిళ్లపై యువకులు రహదారి వెంట భారీ వాహన శ్రేణితో కరీంనగర్ వరకు వచ్చారు. తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద అంబేద్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలను ఆవిష్కరించాలని కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న దళిత సంఘాలకు రసమయితో కలిసి కేటీఆర్ సంఘీభావం తెలిపారు.
అనంతరం తిమ్మాపూర్‌లోని స్థానిక నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గెస్ట్‌హౌస్‌కు వెళ్లి, కొద్దిసేపు కార్యకర్తలతో ముచ్చటించారు. రజతోత్సవ వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. అక్కడి నుంచి ర్యాలీగా అల్గునూర్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు చేరుకోగా, నాయకులు ఘన స్వాగతం పలికారు. సిరిసిల్ల బైపాస్ మీదుగా మంకమ్మతోట వరకు చేరుకున్నారు. ఇక్కడి సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మరో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్ రావు, నగర పార్టీ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.
క్రేన్ సహాయంతో భారీ గజమాలతో కేటీఆర్‌ను సత్కరించారు. మంకమ్మతోటలో కేటీఆర్‌ను చూసిన అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొట్టరు. ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్‌ను చూసేందుకు సామాన్యులు కూడా ఎగబడ్డారు. దాదాపు వెయ్యి మోటర్ సైకిళ్లు, కార్లు ముందూ వెనక అనుసరిస్తుండగా కేటీఆర్ భారీ ర్యాలీ సాగింది. మంకమ్మతోట నుంచి తెలంగాణ చౌక్, బస్‌స్టేషన్, కమాన్ ఏరియా మీదుగా హౌసింగ్ బోర్డు కాలనీ వరకు సాగింది. అక్కడి నుంచి బొమ్మకల్‌లోని వీ కన్వెక్షన్ కేటీఆర్ చేరుకున్నారు.