పోరాటాల గడ్డ జగిత్యాల జనసంద్రమైంది. గులాబీదళం కదం తొక్కితే.. జీవన్‌రెడ్డి అనుచరవర్గం ఉత్సాహంతో కేరింతలు కొట్టింది. ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్‌ను వీడిన మాజీ మంత్రిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాగా, పార్టీ క్యాడర్ దరూర్ నుంచే ఘన స్వాగతం పలికింది. జీవన్ రెడ్డి ఇంటి దాకా బ్రహ్మరథం పట్టింది. కాగా, పార్టీ ముఖ్యనేత కేటీఆర్ స్వయంగా రావడం, పార్టీలోకి మాజీ మంత్రిని ఆహ్వానించడంతో జీవన్వర్గంలోఫుల్ జోష్ నెలకొన్నది. సమావేశం, చర్చలు జరుగుతున్నంత సేపు ‘జై తెలంగాణ’ ‘జై కేసీఆర్ ‘ఏ వన్ జీవన్’ ‘సీఎం కేటీఆర్’ నినాదాలు మార్మోగాయి. ఇద్దరు ప్రజాదరణ కలిగిన ఇరువురు నేతలను చూసేందుకు ఇరు వర్గాలకు చెందిన వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది. మరోసారి జగిత్యాల జిల్లా రాష్ట్రస్థాయిలో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిపోయింది.

జగిత్యాల, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ)/రాయికల్ : రెండున్నరేళ్లుగా కాంగ్రెస్‌లో తీవ్ర అవమానాలకు గురవుతున్న మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఇటీవలే ఆ పార్టీని వీడారు. నాలుగున్నర దశాబ్దాలుగా సేవలందించినా గుర్తింపునివ్వకపోగా.. వలసవాదులకు, ఫిరాయింపుదారులకు ప్రాధాన్యత ఇవ్వడం, అసలైన కాంగ్రెస్వాదులపై కుట్రలు చేయడాన్ని జీర్ణించుకోలేక బయటికి వచ్చారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేక గత నెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆయన వెంటే వేలాది మంది నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
ఈ సందర్భంలోనే రాష్ట్రంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్‌రెడ్డి పనిచేయడం లేదని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుపై విసిగిపోయారని విమర్శించారు. అలాగే పార్టీ మూలసూత్రాలకు భిన్నంగా వలసవాదులను ప్రోత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డిని అధికారంలో నుంచి దించే పార్టీలో చేరుతానంటూ జీవన్‌రెడ్డి ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ప్రజా సంక్షేమం కోసం తపించే బీఆర్ఎస్లో చేరితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, కేసీఆర్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అనుచరులు, కార్యకర్తలు, సహచరులు విన్నవించడంతో జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల జీవన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కాగా, గురువారం జగిత్యాలలో జీవన్‌రెడ్డిని కలిసి బీఆర్ఎస్లోకి లాంఛనంగా ఆహ్వానిస్తారని తెలియడంతో అటు జీవన్‌రెడ్డి వర్గీయుల్లో, ఇటు బీఆర్ఎస్ జిల్లా వర్గాల్లోనూ ఉత్సాహం వెల్లువెత్తింది. గురువారం ఉదయం వరకే జగిత్యాల వీధులన్నీ కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో నిండిపోగా.. 8 గంటల నుంచి పాతబస్టాండ్ ఏరియాలోని జీవన్‌రెడ్డి ఇంటి వద్ద సందడి నెలకొన్నది. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి జీవన్‌రెడ్డికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన జీవన్‌రెడ్డి అనునాయులు పెద్ద సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలతో పాటు, నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సైతం జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్కు చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మాజీ మంత్రి ఇంటికి చేరుకొని, బీఆర్ఎస్లోకి వస్తున్నందుకు శుభాకాంక్షలు చెప్పారు.

Ktr
దారిపొడవునా స్వాగతం
కరీంనగర్ నుంచి జగిత్యాలకు వచ్చిన కేటీఆర్‌కు దారిపొడవునా ఘన స్వాగతం పలికారు. మల్యాల మండలం దరూర్ వద్ద ఘనంగా స్వాగతించారు. అనంతరం ర్యాలీగా జీవన్ ఇంటికి పయనమయ్యారు. సరిగ్గా 3.30 గంటలకు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీమంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కల్వకుంట్ల, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, రసమయి, గణేశ్ గుప్తా, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, పలువురు నాయకులతో కలిసి జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
అప్పటికే వేచి ఉన్న కార్యకర్తలు, నాయకులు చుట్టుముట్టారు. ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ‘సీఎం.. సీఎం.. సీఎం’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఒకేసారి వందలాది మంది రావడంతో కేటీఆర్, జీవన్‌రెడ్డి, ఇతర నాయకులు ఇంట్లోకి వెళ్లేందుకు సైతం వీలు లేకపోయింది. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కొందరు జీవన్‌రెడ్డి అనుచరులు, కార్యకర్తలు, నాయకులను పక్కకు తోస్తూ, కేటీఆర్, జీవన్‌రెడ్డి, ఇతర నాయకులను ఇంట్లోకి తీసుకువెళ్లారు.

Ktr
జీవన్‌రెడ్డి.. కేటీఆర్ ప్రత్యేక సమావేశం
కేటీఆర్ రాక కోసం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి దాదాపు అరగంట పాటు ఇంటి బయట వేచి చూశారు. కేటీఆర్ రాగానే పూలమొక్క, పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శాలువాతో సన్మానించి ఇంట్లోకి ఆహ్వానించారు. కేటీఆర్ సైతం జీవన్‌రెడ్డిని శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. జీవన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులను కేటీఆర్‌కు పరిచయం చేశారు. కేటీఆర్ కొద్ది సేపు వారితో మాట్లాడారు. అనంతరం జీవన్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు ఇద్దరూ సమకాలీన రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు తదితర అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
శ్రేణుల్లో సమరోత్సాహం
కేటీఆర్ స్వయంగా వచ్చి బీఆర్ఎస్లోకి ఆహ్వానించడంతో జీవన్‌రెడ్డి వర్గీయులతోపాటు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. అలాగే జీవన్‌రెడ్డికి పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని, కేసీఆర్‌కు, జీవన్‌రెడ్డికి పరస్పరం గౌరవం ఉందని స్వయంగా కేటీఆర్ ప్రకటించడం శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. వేలాది మంది జనం తరలిరావడంతో జగిత్యాల పట్టణంలో ఉత్సాహం, సంతోషం వెల్లివిరిసింది. కేటీఆర్ పర్యటన కొనసాగినంత సేపు జీవన్‌రెడ్డి ఇంటి ముందు చేరిన అభిమానులు ‘ఏ వన్ జీవన్’ ‘సీఎం కేటీఆర్’ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు.
కేటీఆర్‌ను, జీవన్‌రెడ్డిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, పుష్పగుచ్చాలు అందించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పోటీ పడ్డారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైన ‘జై తెలంగాణ’ ‘తొలి సీఎం కేసీఆర్ జిందాబాద్’ ‘ఏ1 జీవన్’ ‘సీఎం కేటీఆర్’ నినాదాలు దాదాపు రెండున్నర గంటలపాటు కొనసాగాయి. మరోవైపు త్వరలోనే జగిత్యాలలో భారీ సభ నిర్వహించనున్నారన్న చర్చలు మొదలయ్యాయి. కాగా, జగిత్యాలలో గురువారం చోటు చేసుకున్న కేటీఆర్, జీవన్‌రెడ్డి భేటి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాల్లో పెను సంచలనమవుతుందని, ఇది రేపటి రోజున కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జీవన్‌రెడ్డికి సముచిత గౌరవం

Ktr
తెలంగాణ రాష్ట్ర ప్రజల మోముల్లో చిరునవ్వులు తిరిగి రావాలంటే కేసీఆర్ పాలన రావాలి. అందుకోసం అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీమంత్రి జీవన్‌రెడ్డి సైతం కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నరు. అందులో భాగంగానే ఆయన బీఆర్ఎస్తో కలిసి ప్రయాణం సాగించేందుకు సిద్ధపడ్డరు. జీవన్‌రెడ్డికి, తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్‌కు మంచి స్నేహం, అభిమానం ఉన్నయి. జీవన్‌రెడ్డి నిబద్ధత కలిగిన నాయకుడు.
ఆయన నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజలతో మమేకమై ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సూచన మేరకు జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించినం. ఆయన సైతం పార్టీలో చేరేందుకు అంగీకరించిండు. త్వరలోనే కేసీఆర్‌తో భేటీ అవుతరు. తర్వాత పార్టీలో చేరే తేదీని వెల్లడిస్తం. జననేతగా పేరున్న జీవన్‌రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం, సముచిత గౌరవం దక్కుతుంది. బీఆర్ఎస్లో ప్రయాణించేందుకు సుముఖత వ్యక్తం చేసిన జీవన్‌రెడ్డికి మా ధన్యవాదాలు.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ప్రజాహితం కోసం బీఆర్ఎస్లోకి వెళ్త

కేసీఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. కానీ, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తిరోగమనం కనిపిస్తున్నది. రెండున్నరేళ్ల రేవంత్ పాలన ఫ్లాప్ అయింది. ఒకవైపు ఆత్మగౌరవ సమస్య, మరో వైపు ప్రజాహిత నిర్లక్ష్యం నేపథ్యంలోనే కాంగ్రెస్‌ను వీడిన. తెలంగాణ ప్రజల హితం కోసం బీఆర్ఎస్లోకి వెళ్త. ఉద్యమ సాధకుడు కేసీఆర్ నేతృత్వంలో పనిచేసే అవకాశం రావడం సంతోషం. నలభై ఐదేండ్ల తన నా రాజకీయ ప్రస్థానంలో అనేక ఎత్తుపల్లాలను చూసిన. అయితే ప్రజాసంక్షేమం కలిగిన బీఆర్ఎస్లో చేరాలని స్వయంగా కేటీఆర్ ఇంటికి వచ్చి ఆహ్వానించడం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. తెలంగాణ ఉద్యమనేత, తొలి సీఎం కేసీఆర్‌తో నాకు నలభై ఐదేండ్లుగా వ్యక్తిగత స్నేహం, అనుబంధం ఉన్నది. రాజకీయ పార్టీలు ఏవైనా, ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఉన్నది. త్వరలోనే ఆయనను కలిసి మా జ్ఞాపకాలను నెమరేసుకుంటం. త్వరలోనే బీఆర్ఎస్లో చేరే సమయాన్ని వెల్లడిస్త.
– మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి

Ktr