కరీంనగర్ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ( MLA Gangula Kamalakar ) ధీమాను వ్యక్తం చేశారు. శనివారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో (Parliamentary Elections) బీజేపీ, బీఆర్ఎస్ పోటీ ఉంటుందని పేర్కొన్నారు. 2014లోనూ నరేంద్ర మోదీ ( Narendra Modi ) ప్రభంజనంలోనూ కరీంనగర్ లో బీఆర్ఎస్ గెలిచిందని అన్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) మూడవ స్థానానికే పరిమితమైందని ఆరోపించారు. కాంగ్రెస్ సొంతంగా ఇక్కడ గెలిచింది లేదని, ఎమ్మెస్సార్ కూడా బీఆర్ఎస్ సపోర్ట్ తోనే గెలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని, ప్రజా తీర్పును గౌరవిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి పోరాడుతామని, అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా పోషిస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ను ఎవరూ చీల్చలేరని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్లో అత్యధిక కార్పొరేటర్లు బీఆర్ఎస్ సభ్యులే ఉన్నారని,ఇక్కడ అవిశ్వాసం ఉండబోదని అన్నారు. 45 రోజుల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని ఆరోపించారు. కరీంనగర్ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల విషయంలో రాజకీయాలు అవసరం లేదని తెలిపారు. ‘ అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపనను రాజకీయ కోణంలో చూడం. రాముడు అందరివాడు. దైవ కార్యక్రమం ఎవరు చేసినా సంతోషిస్తాం. స్వాగతిస్తామని’ గంగుల కమలాకర్ అన్నారు.