ప్రజారంజక పాలనతో గుండెగుండెకూ చేరువైన బీఆర్ఎస్, మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది లక్షలకుపైగా సభ్యత్వాలతో రికార్డు సృష్టించిన ఆ పార్టీ, పల్లెల్లో గులాబీ జాతర నిర్వహించబోతున్నది. క్షేత్రస్థాయిలో శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు ప్రతి పది గ్రామాల నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయబోతున్నది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లాల వారీగా కో ఆర్డినేట్ చేసేందుకు ఇన్చార్జిలను నియమించారు. ఇప్పటికే రంగంలోకి దిగిన సదరు ఇన్చార్జిలు, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడడంతోపాటు త్వరలోనే ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కరీంనగర్, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వరాష్ట్ర సాధన కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా గడ్డపై నుంచి పోరాటం చేసి.. గమ్యా న్ని ముద్దాడిన బీఆర్ఎస్ అదే దూకుడుగా ముం దుకెళ్తున్నది. నాడు రాష్ట్రం కోసం పోరాడిన ఉద్య మ పంథాలోనే నేడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది. సంక్షేమాన్ని ప్రతి గడపకూ చేరువ చేస్తున్నది. వీటితోపాటు విద్యా, వైద్యం, సాగునీరు ప్రాజెక్టులు ఇలా అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ సర్కారు ప్రజారంజక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. గులాబీ పార్టీకి ఆది నుంచీ కరీంనగర్ గడ్డ అండగా నిలుస్తున్నది. ఎన్నికలు ఏవైనా సరే జైకొట్టి, తన అభిమాన్ని చాటుతున్నది.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మరింత ఆదరణ పెరుగుతున్నది. ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు. సభ్యత్వాలతో సరిపెట్టు కోకుండా మరిం త అక్కున చేర్చుకుంటున్నారు. 2017-18లో జరిగిన సభ్యత్వ నమోదులో ఒక్కో నియోజకవర్గాకి 30వేల చొప్పున 3.90 లక్షల సభ్యత్వం టార్గెట్ ఇవ్వగా.. అప్పుడు 6.14 లక్షలపై చిలుకు నమోదైంది. అలాగే 2021 ఫిబ్రవరి, మార్చిలో ఒక్కోనియోజకవర్గానికి 50 వేల చొప్పున 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు 6.50 లక్షల టార్గెట్ ఇవ్వగా, సుమారు 9 లక్షలపై చిలుకు నమోదైంది. అందులో అత్యధికంగా సిరిసిల్ల నియోజకవర్గంలో లక్షకుపైగా సభ్యత్వం నమోదుకాగా, రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు.. ఉమ్మడి జిల్లాలో గులాబీ జాతర ప్రా రంభం కాబోతున్నది. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వా త అనంతరం మొదటిసారి క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలకు కేటీఆర్ రూపకల్పన చేశారు. పది గ్రామాలకో యూ నిట్ చొప్పున ఈ సమ్మేళనాలను నిర్వహించాలని ఆదేశించారు. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జీలను నియమించా రు. అందులో భాగంగా పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్‌ను జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను నియమించారు. పెద్దపల్లి జిల్లా కు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నియమించారు.
సదరు ఇన్చార్జీలు అనుసరించాల్సిన పద్ధతులు, నిర్వహించాల్సిన ఆత్మీయ సమ్మేళనాలు, నాయకుల మధ్య కో-ఆర్డినేషన్ చేయడం, వీటికోసం ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యల వంటి అంశాలపై ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం చేశారు. సదరు విషయాలను ఇప్పటికే ఆయా జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు సదరు ఇన్చార్జీలు వివరించారు. ఈ మేరకు అతి త్వరలోనే అన్ని జిల్లాల్లో ముందుగా ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించి.. త్వరలోనే ఆత్మీయ సమ్మేళనాలకు రూపకల్పన చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. నిజానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు ద్వారా.. గులాబీ జాతరకు తెరలేవడమే కాదు, శ్రేణుల్లో నూతనోత్సాహం రావడానికి అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ప్రజల్లోకి చొచ్చుకెళ్లడానికి కావాల్సిన సమాచారం, అలాగే విపక్షాలు చేస్తున్న ఆధారం లేని ఆరోపణలను తిప్పి కొట్టేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు వేదికగా ఉపయోగపడనున్నాయి.
అత్మీయ సమ్మేళనాలతోపాటు వివిధ సందర్భాలను బట్టి నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం చేశారని ఆయా జిల్లా ఇన్చార్జీలు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఆదేశాలను క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు చేస్తామని, కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనాలను పండుగలా నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి కార్యకర్తనూ సన్నద్ధం చేసేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు చాలా ఉపయోగపడుతాయి. ఇదే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది.