మంథని, ఆగస్టు 18 : కల్యాణలక్ష్మి ఎగవేత కుట్రలపై బీఆర్ఎస్ నాయకులు రెండో రోజూ కన్నెర్రజేశారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం మంథనిలో భారీ ధర్నా చేశారు. స్థానిక రాజగృహ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, జడ్పీ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. దారి పొడవునా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రధాన రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలు బతుకమ్మ ఆడుతూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాపాలన పేరిట ప్రజలను వంచించే పాలనకు తెరలేపిందని విమర్శించారు. 420 హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు మేనమామలా సాయం అందించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన కల్యాణలక్ష్మి రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పథకాన్ని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దగ్గర పడుతున్నా రాష్ట్రంలో కొత్త పథకాలు అమలు చేయకపోగా ఉన్నవి ఊడగొడుత్నునారని వాపోయారు. మంత్రులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పథకాలకు మంగళం పాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని కుర్చీ నుంచి దించాలని హితవు పలికారు. కార్యక్రమం అనంతరం బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి, ఏవోకు పుట్ట శైలజ వినతి పత్రాన్ని అందించారు.