BRS Social Media, Warrior | పెద్దపల్లి, మే 29(నమస్తే తెలంగాణ)/మంథని రూరల్: ఇటీవల బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన భరోసా నిజమైంది. బీఆర్ఎస్ వారియర్లు ఎక్కడా.. వనకాల్సిన, జనకాల్సిన అవసరం లేదని మీకోసం పని చేసేందుకు బీఆర్ఎస్ లీగల్ టీం ఉందని, ప్రభుత్వ కేసులను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, బరిగీసి కొట్లాడాలని పార్టీ మీకు అండగా నిలుస్తుందని చెప్పిన మాటలు నిజమయ్యాయి.
వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో నివాసముంటున్న సోషల్ మీడియా వారియర్ జక్కు శ్రావణ్‌కుమార్ ఇటీవల కాళేశ్వరంలో జరిగిన సరస్వతీ పుష్కరాల్లో, రాష్ట్రంలో జరిగిన అందాల పోటీల్లో వివాదాస్పదమైన అంశాలను పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో మంగళవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లి గ్రామానికి చెందిన టీపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆంగోతు సుగుణ కాటారం పోలీసు స్టేషన్, హైదరాబాద్‌కు చెందిన టీపీసీసీ సోషల్ మీడియా కార్యదర్శి కైలాష్ సజ్జన్ హైదరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని సైబర్ కైం సీసీఎస్ ఏసీపీకి జక్కు శ్రావణ్‌కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి తర్వాత మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో జక్కు శ్రావణ్‌కుమార్ ఇంటికి వచ్చి ఆయనను అరెస్టు చేసి తీసుకొని వెళ్లారు. విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ టాటిన హైదరాబాద్ వెళ్లి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీంలను కలిసి ఆయనకు బెయిల్ కోసం పని చేశారు. శ్రావణ్‌కుమార్‌ను నాంపల్లి కోర్టులో హాజరు పరచగా బీఆర్ఎస్ లీగల్ సెల్ వాధనలతో ఏకీభవించిన కోర్ట్ శ్రావణ్‌కుమార్‌కు బెయిల్ మంజూరీ చేసేంది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.
బీఆర్ఎస్ పార్టీ వారియర్స్‌కు బీఆర్ఎస్ లీగల్ సెల్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అండగా నిలవడం పట్ల ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ వెంట జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జక్కు రాఖేష్, పూదరి సత్యనారాయణగౌడ్ ఉన్నారు.